కుప్పం.. పెద్ద టార్గెట్టే పెట్టుకున్నరు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించాల‌ని అధికార పార్టీ వైసీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని, కానీ, ఆ పప్పులేవీ ఉడ‌క‌వ‌ని.. తాను ల‌క్ష ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకుంటాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. కుప్పం ప్ర‌జ‌లు త‌న‌తోనే ఉన్నార‌ని బాబు వెల్ల‌డించారు. తాజాగా బెంగ‌ళూరు నుంచి కుప్పం చేరుకున్న ఆయ‌న మూడు రోజుల పాటు ఇక్క‌డే బ‌స చేసి.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌నున్నారు.

కుప్పం వ‌చ్చిన చంద్ర‌బాబు తొలుత‌.. గుడుప‌ల్లిలో నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడారు. వైసీపీ అధినేత‌, సీఎం జగన్ మోసపూరిత నవరత్నాలు ఇస్తున్నాడని విరుచుకుపడ్డారు. కుప్పంలో రౌడీయిజం, భూదం దాలు ఎక్కువయ్యాయని, తాను అధికారంలోకి రాగానే ఎవ‌రిని ఎక్క‌డ ఉంచాలో అక్క‌డే ఉంచుతాన‌ని అన్నారు. జగన్ అండతో నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ అక్రమ మైనింగ్ చేస్తున్నారని, తాట తీస్తాన‌ని చెప్పారు. టీడీపీ త్వరలోనే అధికారంలోకి వస్తుందని, తమ ప్రభుత్వం ఏర్పడగానే రౌడీలను అణిచివేస్తామని చెప్పారు.

టీడీపీ అధికారంలోకి రాగానే 10 లక్షల లీటర్ల పాలును ఉత్పత్తి చేసే పరిశ్రమను తీసుకొస్తామని చంద్రబా బు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్(ఆరు గ్యారెంటీలు) అర్హులైన‌ అందరికీ అమలయ్యేలా తాను మాటిస్తు న్నానన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమందికి సంవత్సరానికి గాను రూ.15,000 ఇస్తామన్నారు. తామిచ్చిన మాట ప్రకారం మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ తెస్తామని వైసీపీ వాళ్లు హామీ ఇచ్చారని, మరి ఆ క్యాలెండర్ వచ్చిందా? అని నిల‌దీశారు.

కుప్పంలో త‌న‌ను ఓడిస్తాన‌ని శ‌ప‌థం చేసిన‌ వైసీపీ నాయకులు ఏమీ చేయలేకపోయారని తూర్పారప ట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే బాధ్యతని తాను తీసుకుంటానని, నిరుద్యోగ భృతి నెలకు రూ.3000 తప్పకుండా ఇస్తానని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని మాటిచ్చారు. అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని, ప్రతి ఒక్కరి భవిష్యత్తుని మెరుగుపరుస్తానని చెప్పారు. ఇక్క‌డ చూస్తున్న ప్ర‌జ‌ల‌ను చూస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నాకు ల‌క్ష ఓట్ల మెజారిటీ ఖాయ‌మ‌ని అనిపిస్తోంది అని చంద్ర‌బాబు నొక్కి చెప్పారు.