ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్న దరిమిలా.. వంగవీటి రంగా వారసుడు రాధాకు కూడా.. రాజకీయ స్పేస్ పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. అయితే ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు. ఆయన కూడా పార్టీపై ఒత్తిడి తేవడం లేదు. గత ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేసిన ఓకే అన్న వైసీపీ.. రాధా కోరుకున్న విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇవ్వలేదు. దీంతో ఆయన అలిగి బయటకు వచ్చారు.
ఇక, అప్పటి నుంచి ఆయన టీడీపీలోనే ఉన్నారు. రాజధాని ఉద్యమంలోనూ పాల్గొన్నారు. మొత్తంగా.. కొన్ని రోజులు యాక్టివ్‌గా ఉన్నా.. మరికొన్ని రోజులు.. మౌనంగానే ఉండిపోయారు. ఇవన్నీ ఇలా ఉంటే.. టీడీపీలో ఉన్నా.. ఆయన వైసీపీ నాయకులతో చెలిమి చేస్తుండడం మరో చిత్రమైన పరిణామం. ఇది కూడా కొన్నాళ్ల కిందట రాజకీయ చర్చకు దారితీసింది. ఇలాంటి చర్చ వచ్చినప్పుడు.. తాను టీడీపీలోనే ఉన్నానని చెప్పుకోవడం మినహా ఆయన చేసింది లేదు.
ఇదిలావుంటే.. ఇప్పుడు వంగవీటి రాధాకు రెండు కీలక పార్టీల నుంచి పిలుపు వస్తోంది. దీనిలో ఒకటి.. కాంగ్రెస్ పార్టీ. రంగా తమవాడేనని చెబుతున్న కాంగ్రెస్.. రాధాకు రెడ్ కార్పెట్ పరుస్తామని.. విజయవాడ పగ్గాలు అప్పగిస్తామని, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెస్తామని రాయబారం నడుపుతోంది. అంతేకాదు.. కోరుకున్న చోట టికెట్ ఇస్తామని కూడా చెబుతుండడం గమనార్హం. ముఖ్యంగా ఈ విషయంలో పార్టీ చీఫ్ గిడుగు రుద్రరాజు దూకుడుగా ఉన్నారు.
గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోని నేపథ్యంలో ఇప్పటికైనా.. 10 స్థానాల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈనేపథ్యంలోనే రాధాకు పిలుపు వస్తోందని తెలిసింది. మరోవైపు.. వైసీపీ నుంచి కూడా రాధాకు పిలుపు అందుతోంది. వచ్చే ఎన్నికల్లో కాపుల ఓటు బ్యాంకు కీలకంగా మారనున్న నేపథ్యంలో రంగా వర్గాన్ని తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్న పార్టీ.. రాధాను తిరిగి వచ్చేలా చేసే బాధ్యను ఓ ఫైర్‌బ్రాండ్‌కు అప్పగించినట్టు చర్చసాగుతోంది.