ఏపీలో జంపింగులు రెడీ.. డౌటేంటంటే…!

ఏపీలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి నాయ‌కులు అంత‌ర్మ‌థ‌నంలో ఉన్నా రు. త‌మ‌కు టికెట్ ద‌క్కుతుందో లేదో అనే బెంగ‌తో ఉన్న నాయ‌కులు ప‌క్క దారులు వెతుక్కుంటున్నా రు. ముఖ్యంగా వైసీపీ నుంచి భారీ సంఖ్య‌లో ఈ జంపింగులు ఉండే అవ‌కాశం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే టికెట్ ద‌క్క‌ద‌న్న సందేహంతో ప‌లువురు నాయ‌కులు.. పొరుగు పార్టీల‌తోనూ చ‌ర్చ‌లు చేస్తున్నట్టు స‌మాచారం.

పిఠాపురం, గుంటూరు ప‌శ్చిమ‌(టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన‌), మ‌డ‌కశిర వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మె ల్యేలు.. పొరుగు పార్టీల‌పై దృష్టి పెట్టారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు హైద‌రాబాద్‌లోనే మ‌కాం వేసి.. ఓ కీల‌క పార్టీలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇక‌, గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే కూడా .. తిరిగి పీచే ముడ్ అన్న‌ట్టుగా సొంత పార్టీలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

ఇలా.. చాలా మంది నాయ‌కులు త‌మ త‌మ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. అయితే, ఇలాంటి వారి విష‌యంలో వైసీపీ ఎక్క‌డా బుజ్జ‌గింపు రాజ‌కీయాల‌కు తెర‌దీయ‌లేదు. అంతేకాదు.. క‌నీసం వారితో చ‌ర్చించేందుకు కూడా ముందుకు రావ‌డం లేదు. ఇప్ప‌టికే వ‌చ్చిన అనేక స‌ర్వేలు.. ముఖ్యంగా ఐప్యాక్ టీం ఇచ్చిన స‌ర్వే రిజ‌ల్ట్‌తో వీరిని పక్క‌న పెట్టినట్టు పార్టీలో చ‌ర్చ సాగుతోంది. ఇక‌, ఇదే స‌ర్వే ఫ‌లితాల‌ను ఇత‌ర పార్టీలు కూడా విశ్వ‌సిస్తున్నాయ‌నే వాద‌న ఉంది.

“ఎక్క‌డైనా గెలిచే నాయ‌కులే అవ‌స‌రం. మాకు మాత్రం ఓడిపోయే నాయ‌కులు ఎందుకు?” అని టీడీపీ స‌హా.. జ‌న‌సేన‌లోనూ చ‌ర్చ సాగుతోంది. అయితే.. వైసీపీ నుంచి వ‌చ్చే నాయ‌కుల‌ను చేర్చుకోవాల‌నే భావన ఉన్న‌ప్ప‌టికీ.. టికెట్ల కేటాయింపు మాత్రం లేక‌పోయే అవ‌కాశ‌మే మెండుగా ఉంద‌ని అంటున్నారు. ఆయా పార్టీల్లోనే నాయ‌కులు లెక్క‌కు మించి ఉండ‌డంతోపాటు.. పోటీ కూడా తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో వైసీపీ వ‌ద్ద‌ని ముద్ర వేసిన నాయ‌కుల‌ను తిరిగి పోటీ చేయించ‌డంపై పార్టీలు ఒక స్ప‌ష్ట‌త‌తో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే జంపింగుల‌కు.. పార్టీలు మార‌డం బాగానే ఉన్నా.. కోరిక‌లు తీర‌డంమాత్రం క‌ష్ట‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.