కేసీఆర్ ఉద్య‌మ‌కారుడు కాదు: మాజీ ఐఏఎస్

తాజాగా జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన బీఆర్ ఎస్ పార్టీపైనా.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ పైనా.. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మకారుడు కాద‌ని.. తెలంగాణ విధ్వంస‌కారుడ‌ని వ్యాఖ్యానించారు. కేసీఆర్ త‌న పాల‌న‌లో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారని ఆరోపించారు. తాజాగా తెలంగాణ తహసీల్దార్స్‌ అసోసియేషన్‌ (టీజీటీఏ) ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ బలోపేతానికి చర్చా కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లచ్చిరెడ్డి అధ్యక్షతన జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడుతూ.. జిల్లాల్లో కలెక్టర్లను రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లుగా, ఎమ్మెల్యే లను భూకబ్జాకోరులుగా, దొంగలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆయ‌న పాల‌న‌లో నిజాలు చెప్పే ధైర్యం కూడా ప్ర‌తి ఒక్క‌రిలోనూ చ‌చ్చిపోయింద‌ని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎంత సీనియ‌ర్ అధికారి అయినా.. నోరు విప్ప‌లేని ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. అది స‌హించ‌లేకే త‌ను త‌న ఉద్యోగానికి రాజీనామా చేశాన‌ని చెప్పారు.

ధ‌ర‌ణి కేసీఆర్ కోసం: కోదండ‌రాం

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్రొఫెసర్‌ కోదండరాం ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. సొంత అవసరాల కోసం చట్టాలను తయారు చేస్తే ఎలా ఉంటుందో అదే ‘ధరణి’ అని వ్యాఖ్యానించారు. కీల‌క‌మైన‌ భూ రికార్డులను ధ్వంసం చేశారని, ఇష్టానుసారంగా మార్చుకున్నారని ఆరోపించారు. అందుకే దానిపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చి.. అది వ్య‌తిరేక ఓటుగా మారింద‌ని వ్యాఖ్యానించారు.

టీడీఎఫ్ బ‌లోపేతం

తెలంగాణ ఉద్యమంలో మాదిరిగానే రాష్ట్ర అభివృద్ధిలో కూడా తెలంగాణ డెవల‌ప్‌మెంట్‌ ఫోరం (టీడీఎఫ్‌) కీలక పాత్ర పోషించాలని కోదండరాం సూచించారు. టీడీఎఫ్‌ 7వ ‘ప్రవాసీ తెలంగాణ దివస్‌’ లో పాల్గొన్న ఆయ‌న రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధే ద్యేయంగా ముందుకు సాగాల‌ని తెలిపారు.