ఏపీలో ఎంపీ సీట్లు హాట్ కేకుల్లా మారాయి. ఆ పార్టీ ఈపార్టీ అనే తేడా లేకుండా.. అన్ని పార్టీలదీ ఇదే పరిస్థితిగా ఉంది. అధికార పార్టీలో అయితే.. ఏకంగా 70 నుంచి 120 కోట్ల వరకు కూడా ఎంపీ సీటుకు ధర పలుకుతున్నట్టు ప్రచారంలో ఉంది. అదే సమయంలో గత ఎన్నికల్లో చేసిన ప్రయోగాలకు కూడా.. ఈ దఫా పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు, ప్రజలను మెప్పించగల నాయకులకు మాత్రమే టికెట్ ఇవ్వాలని దాదాపు నిర్ణయానికి వచ్చాయి.
అయితే.. ఇక్కడ ఒక పార్టీ వ్యూహం పై మరోపార్టీ ఆధారపడి ఉండడం గమనార్హం. ప్రత్యర్థి పార్టీ వేసే అడుగులను చాలా నిశితంగా గమనిస్తున్న పార్టీలు.. ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలను దెబ్బకొట్టేలా పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ సీట్లకు ఎనలేని ప్రాధాన్యం పెరిగిపోయింది. ఒక ఎంపీ స్థానంలో కనీసం.. ఆరు నుంచి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిని తమ ఖాతాలో వేసుకోవాలంటే.. ఎంపీ షేర్ కీలకంగా ఉంది.
అదే సమయంలో ఎంపీ బలమైన నాయకుడు అయితేనే ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకునే అవకాశం ఉంటుందని కూడా పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో బలమైన ఎంపీ అభ్యర్థుల కోసం వెతుకున్నట్టు పార్టీల్లో చర్చ సాగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఎంపీ స్థానానికి ఏకంగా 150 కోట్ల వరకు ఖర్చు పెడతానంటూ.. ఓ నాయకుడు ప్రతిపక్ష పార్టీకి ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారంలో ఉంది. దీంతో ఇంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టే నాయకుడి కోసం అధికార పార్టీ బూతద్దం పట్టుకుని వెతుకుతోందని తెలిసింది.
అదేవిధంగా విశాఖ, విజయవాడ, రాజమండ్రి ఎంపీ సీట్లు మరింత ఎక్కువగానే ధర పలుకుతున్నాయని సమాచారం. ఇక్కడ పోటీ అంటే.. సామాన్యం కాదనే టాక్ కూడా వినిపిస్తోంది. గత ఎన్నికలకు భిన్నంగా ఇప్పుడు ఏపీలో రాజకీయం మారుతుండడంతోపాటు.. పోటీ కూడా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మనీ విషయంలో ఏ పార్టీ కూడా రాజీ పడే పరిస్థితి లేదని స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు ఆయా పార్టీల నాయకులు. దీంతో ఆశలు పెట్టుకున్న వారు కూడా.. పక్కకు తప్పుకుంటున్న పరిస్థితి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.