వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో పాగా వేయాలని.. ప్రధాని నరేంద్ర మోడీ సర్కారును ఇంటికి సాగనంపాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే క్రతువును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసింది. దీనిలో ఇప్పటి వరకు 18 ప్రాంతీయ పార్టీలతోపాటు.. కమ్యూనిస్టులు కూడా చేరిపోయారు. ఇప్పటికి .. నాలుగు దఫాలుగా సమావేశం కూడా నిర్వహించారు.
వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని త్వరలోనే నిర్ణయించనున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలు మినహా.. ఇతర అన్ని రాష్ట్రాల నుంచి ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ ఎస్.. సొంతగానే జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోకుండా ఉండి ఉంటే.. బీఆర్ ఎస్ జాతీయ రాజకీయాలు దూకుడుగా ఉండేవి.
తెలంగాణలో బీఆర్ ఎస్ తప్ప.. మిగిలిన ఎంఐఎం, బీజేపీలు ఎలానూ జాతీయ పార్టీలే. ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఇక్కడ రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. వైసీపీ ఇండియా కూటమిలో చేరే ప్రసక్తిలేదు. దీంతో ఇప్పుడు ఇండియా కూటమి.. టీడీపీపై దృష్టి పెట్టినట్టు తెలిసింది. వచ్చేయాలని.. వస్తే చేర్చుకుంటామని.. రాష్ట్రంలోనూ బలంగా పోరాడదామని.. ఇండియా కూటమి పరోక్షంగా చంద్రబాబుకు ఆఫర్ ఇచ్చింది.
ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న సీపీఐ తరఫున నారాయణ ఇదే విషయాన్ని బహిరంగంగానూ.. వ్యక్తి గతంగానూ చంద్రబాబుకు చేరవేశారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిలో చేరాలని.. తద్వారా బలోపేతం అవ్వాలనేది ఆయన సూచన. అయితే.. దీనిని చంద్రబాబు ఎలా స్వీకరిస్తారనేదిఆసక్తిగా మారింది. ఇండియా కూటమిలో చేరితే.. పార్టీ బలోపేతం అవుతుందో లేదో పక్కన పెడితే.. ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న బీజేపీ మాత్రం మరోసారి టీడీపీని పక్కన పెట్టడం ఖాయమని అంటున్నారు. దీంతో ఇండియా కూటమి ఆఫర్‌పై చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది.