జనసేన పార్టీలో చేరికల వ్యవహారం పుంజుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపిస్తు న్నాయని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో పార్టీని ఆశించిన మేరకైనా.. గౌరవప్రదమైన స్థానా ల్లో విజయం దక్కించుకునేలా చేయాలని జనసేన అధినేత ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జిల్లాల పర్యటన చేస్తున్న జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. చేరికలపైనా దృష్టి పెట్టారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించిన నాగబాబు.. ఆ ఒక్క జిల్లాకే పరిమితం కాకుండా.. తనను కలిసేందుకు వచ్చిన వారితోనూ భేటీ అవుతున్నారు. ఇదే పార్టీలో జోష్ నింపుతోంది. ఇక, విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి.. తాజాగా నాగబాబుతో చర్చించడం రాజకీయాలలో ఆసక్తిని రేపింది. ప్రస్తుతం వైసీపీలో ఉండీ ఉండనట్టుగా ఉన్న యలమంచిలి రవి.. గత ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్నారు.
దీనికి ముందు ప్రజారాజ్యం తరఫున 2009లో విజయం దక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు మాత్రం వైసీపీలో ఉన్నా.. ఆయనకు టికెట్ దక్కక పోతుండడంతో మౌనంగా ఉన్నారు. కమ్మ వర్గానికి చెందిన నాయకుడు కావడం.. తూర్పులో కమ్మ ఓట్లకు ప్రాధాన్యం ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన తరఫున పోటీ చేయాలనే వ్యూహంతో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇక, జనసేనలోకి ఎప్పుడు చేరుతారనేది ఇతమిత్థంగా తెలియక పోయినా.. ప్రస్తుతం జనసేన మాత్రం తూర్పు నియోజకవర్గం కావాలని.. పొత్తులో భాగంగా టీడీపీతో మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. ఇది.. టీడీపీ వదులుకున్నా.. విజయవాడ తూర్పు నుంచి ఖచ్చితంగా కమ్మ సామాజికవ ర్గానికి చెందిన నాయ కుడికే కేటాయించాల్సి ఉంటుంది. దీంతో జనసేనలో రవోదయం ఖాయమనే చర్చ ఊపందుకుంది. ఇదే జరిగి..జనసేన తరఫున రవి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే.. జనసేనలో ఈ సీటు ఖాయంగా పడుతుందని అంటున్నారు పరిశీలకులు.