టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగళం-నవశకం బహిరంగ సభ జరిగింది. ఈ సభకు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్…జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ కు ప్రజాస్వామ్య విలువలు తెలియవని విమర్శించారు. తల్లికి, చెల్లికి విలువ ఇవ్వని వాడు ప్రజలకు ఎందుకు ఇస్తాడని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దూషిస్తారా అని ప్రశ్నించారు. వారాహి యాత్రలో తనపై దాడులు చేశారని ఆరోపించారు.
2014లో టీడీపీ, బీజేపీతో కలిసి అడుగులు వేశానని, కానీ, సమాచార లోపం వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల 2019లో ఒంటరిగా జనసేన బరిలోకి దిగిందని చెప్పారు. ఆ పరిణామంతో 2019 ఎన్నికల్లో జగన్ గెలిచి రాష్ట్రాన్ని ఈ దుస్థితికి తెచ్చారని అన్నారు. అందుకే, 2024లో రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ-జనసేన పొత్తు అనివార్యమని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కుదురుకునే వరకు పొత్తు కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందిస్తామని, టీడీపీతో కలిసి జనసేన సంయుక్తంగా కార్యక్రమాలు రూపొందిస్తుందని పవన్ చెప్పారు.
భవిష్యత్తులో జరగబోయే మరో సభలో ఉమ్మడి కార్యాచరణను విడుదల చేస్తామని అన్నారు. టీడీపీ- జనసేన పొత్తుకు బిజెపి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నట్టుగా పవన్ చెప్పారు. ఇక, లోకేష్ చేసింది జగన్ చేసినటువంటి పాదయాత్ర కాదని పవన్ అన్నారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదని ముఖ్యమంత్రిని మార్చాలని జగన్ కు చురకలంటించారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కక్ష సాధింపు వ్యక్తి అని, దశాబ్దాల రాష్ట్ర రాజకీయ చరిత్రలో వైఎస్ తో సహా ఎవరూ…ఇంట్లో ఆడవాళ్లపై దూషణలకు దిగలేదని అన్నారు.
ఇక, తనకు పాదయాత్ర చేసే అవకాశం లేనందుకు బాధగా ఉందని పవన్ చెప్పారు. లోకేష్ చేసింది మాటల పాదయాత్ర కాదని, చేతల్లో పాదయాత్ర అని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలు వింటూ లోకేష్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని పాదయాత్రను విజయవంతంగా ముగించారని చెప్పారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుకు, జగన్ ను సోనియా గాంధీ జైలులో పెట్టారని అ్నారు. ఆ కక్ష చంద్రబాబుపై చూపించడం అవివేకమన్నారు. చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు సాయంగా ఉండాలని భావించానని, ఏదో ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వలేదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates