యువగళం-నవశకం సభలో ఏపీ సీఎం జగన్ పై హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కనకపు సింహాసనంపై శునకం అన్న రీతిలో సైకో పెత్తనం సాగిస్తున్నారని బాలయ్య బాబు సంచలన కామెంట్లు చేశారు. ఈ చెత్త ప్రభుత్వం చేతకాని ప్రభుత్వ ఉండటం మన ఖర్మ అని మండిపడ్డారు. జగన్ పాలనలో అభివృద్ధి శూన్యం..అప్పులు మాత్రం 5 లక్షల కోట్లు అని బాలకృష్ణ ఆరోపించారు.
నిత్యావసర ధరలు, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని బాలకృష్ణ మండిపడ్డారు. డ్రగ్స్ రాకెట్, గంజాయి పండించడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. వైసిపి నాయకులు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ స్కాములు చేసి కోట్లు దోచుకుంటున్నారని బాలకృష్ణ ఆరోపించారు. 5 కోట్ల ప్రజల కలల రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారని, ప్రజలు ఇదేంటి అని ప్రశ్నిస్తే వారిని భయభ్రాంతులకు గురిచేసి వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని బాలకృష్ణ ఆరోపించారు.
అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమాలను అణచివేశారని, రైతులపై కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని బాలయ్య మండిపడ్డారు. అన్ని రంగాల్లో వెనకబడ్డామని, ఏపీకి పరిశ్రమలు రావడంలేదని, యువతకు ఉపాధి లేదని దుయ్యబట్టారు. హిందూపురంలో ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో తాను, తన కార్యకర్తలు, అభిమానులు అభివృద్ధి చేశామని అన్నారు. చాలా చోట్ల ప్రభుత్వాసుపత్రులలో కుక్కలు, పందులు తిరుగుతున్నాయని అన్నారు.
మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని, కులాలు మతాలు కాదని…రాష్ట్రం భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. జగన్ పాలన విధ్వంసం అని, తెలంగాణకు పొరపాటున ఆయనను పంపిస్తే సరిహద్దులోని కాల్చిపడేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలు చూసి మోసపోవద్దని, జగన్ పాలన ఇదే విధంగా కొనసాగితే, ఆయనను గద్దించకపోతే ప్రపంచ పటంలో ఏపీ ఉండదని బాలకృష్ణ అన్నారు. జనసేన, టీడీపీ కలిసి ఉమ్మడిగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని, ఈ కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఏం ఉద్ధరించాడని జగన్ కు ఓటేయాలని బాలయ్య ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates