పాత కేసులను తిరగ తోడుతున్నారా ?

సినిమా ఇండస్ట్రీకి డ్రగ్స్ కు విడదీయరాని బంధం ఏర్పడిపోయింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులకు ఏదో రకంగా డ్రగ్స్ తో గట్టి బంధముందన్న విషయం చాలాసార్లు బయటపడింది. కేసీయార్ హయాంలో టాలివుడ్-డ్రాగ్స్ బంధంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎవరిమీదా సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. సినిమా పరిశ్రమలోని కొందరు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారనే ఆరోపణలు ఎంతగా వినిపించినా అప్పట్లో కేసీయార్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ బాధితులుగా స్వయంగా కేసీయార్ చెప్పటంతో ఎవరిమీదా ఎలాంటి యాక్షన్ లేకుండాపోయింది.

అయితే తాజాగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం డ్రగ్స్ చెలామణిపై చాలా సీరియస్ గా ఉంది. కాలేజీలు, స్కూల్స్, పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లపైన గట్టిగా నిఘా పెట్టాలని డిసైడ్ అయ్యింది. దానికితోడు గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని, అనుమానితులను కూడా మళ్ళీ పిలిపించి విచారించాలని నిర్ణయించింది. ఈ విషయమై యాంటీ నార్కోటిక్స్ అధికారులు చాలా సీరియస్ గా ఉన్నారు. దాంతో టాలీవుడ్ లో ప్రముఖుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

అప్పట్లో టాలివుడ్ లోని ప్రముఖుల్లో సుమారు 20 మందిని పిలిపించి ఎక్సైజ్ శాఖ రోజుల తరబడి విచారించిన విషయం గుర్తుండే ఉంటుంది. రవితేజ, ఛార్మి, పూరీ జగన్నాధ్, నవదీప్, సుబ్బరాజు లాంటి చాలామందిని విచారించారు ఉన్నతాధికారులు. విచారణ తర్వాత వాళ్ళపై ఎలాంటి యాక్షన్ లేకుండా వదిలేయటంతో అది ఇంకొంతమందికి ధైర్యమిచ్చింది. ఈమధ్య కొందరు ప్రముఖులు బిజినెస్ చేస్తు పట్టుబడటమే దీనికి ఉదాహరణ.

అందుకనే అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖులందరినీ మళ్ళీ పిలిపించి విచారించేందుకు నార్కోటిక్స్ అధికారులు రెడీ అవుతున్నారట. అదే జరిగితే చాలామంది సినిమా ప్రముఖులు డ్రగ్స్ దందాల్లో కేసులు ఎదుర్కోక తప్పదు. ముందు అరెస్టులు జరిగితే పరిశ్రమ కుప్పకూలిపోవటం ఖాయం. నిజంగా యాంటీ నార్కోటిక్స్ అధికారులు గనుక ఉక్కుపాదం మోపితే ఎంతమంది సినీ ప్రముఖులు, వాళ్ళ వారసులు తగులుకుంటారో తెలీదు. అందుకనే పరిశ్రమలోని ప్రముఖుల్లో టెన్షన్ పెరిగిపోతోందట. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.