తనకు టికెట్ కన్ఫర్మ్ అంటోన్న రోజా

వైసీపీ ఎమ్మెల్యేలలో 11 మంది సిట్టింగ్ ల స్థానాలను సీఎం జగన్ మార్చిన సంగతి తెలిసిందే. దాంతోపాటు మరో 45 మందితో సెకండ్ లిస్ట్ కూడా రెడీ అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే గోదావరి, గుంటూరు జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలతో జగన్ నిన్న భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి రోజాకు కూడా ఈసారి టికెట్ దక్కకపోవచ్చు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై, ఆ ప్రచారంపై రోజా స్పందించారు. తనకు టికెట్ రాదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తు శునకానందం పొందుతున్నారని రోజా ఫైర్ అయ్యారు.

అయితే, వారి ఆశలు ఫలించవని. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారని, రెండు నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకుంటున్నారని రోజా అన్నారు. తమ నియోజకవర్గాలలో కష్టపడి పనిచేసిన వారికి సీట్లు ఎక్కడికి పోవని అన్నారు. మంత్రులు తమ నియోజకవర్గంతో పాటు వేరే ఒక నియోజకవర్గంలో కూడా పట్టు కలిగి ఉంటారని, అందుకే రెండు నియోజకవర్గాల బాధ్యతను కలిపి మంత్రికి అప్పగిస్తుంటారని చెప్పారు.

ఒకవేళ ఎవరికైనా సీటు దక్కకుంటే అది వారి పొరపాటు అని, అది జగన్ పొరపాటు కాదని అన్నారు. కొందరు వాళ్లకు వాళ్లే సీట్లు రాలేదని ఊహించుకుంటే ఏమీ చేయలేమని చెప్పారు. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వారితో రెండు మూడు పర్యాయాలు చర్చించిన తర్వాతే జగన్ నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. గుడ్డిగా ఎక్కడా సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేయలేదని అన్నారు.