ఒకటి కాదు.. రెండు కాదు..ఏకంగా 20 ఏళ్లబట్టి.. టీడీపీ ఆ నియోజకవర్గంలో పల్టీలు కొడుతోంది. రాజధాని ఇచ్చామని.. ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించామని చెప్పిన 2019 ఎన్నికల్లోనూ ఇక్కడ పార్టీ పుంజుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడైనా.. ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుం దా? విజయం దక్కించుకుంటుందా? అనేది ఆసక్తికర చర్చగా మారింది. అదే.. గుంటూరు తూర్పు నియోజకవర్గం.
2008కి పూర్వం గుంటూరు-1 నియోజకవర్గంగా ఉన్న ఈ స్థానంలో చిన్న చిన్న మార్పులు చేసి.. గుంటూరు తూర్పు నియోజకవర్గంగా మార్పు చేశారు. మైనారిటీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడంతో ఈ నియోజకవర్గంలో 1983 నుంచి ఇక్కడ మైనారిటీ నేతలకే అన్ని పార్టీలూ టికెట్ ఇవ్వడం మొదలు పెట్టాయి. ఆ తర్వాత.. ఇప్పటి వరకు ఇతర సామాజిక వర్గాల నాయకులు ఇక్కడ గెలిచింది కూడా లేదు. 1983లో టీడీపీ తరఫున పోటీ చేసిన పటాన్ ఖాన్ విజయం దక్కించుకున్నారు.
ఆ తర్వాత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక, 1994-1999 మధ్య లాల్ జానా భాషా కృషి తో మరోసారి టీడీపీ విజయం దక్కించుకుని.. గెలుపు గుర్రం ఎక్కింది. ఇక, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు(2004-2009-2014-2019) అంటే.. దాదాపు 20 ఏళ్లుగా టీడీపీ ఇక్కడ గెలిచిందే లేదు. వాస్తవానికి రాజధాని అమరావతిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో టీడీపీ హవా ఇక్కడ కూడా ఉంటుందని అంచనా వేసినా.. ఫలితం అయితే దక్కలేదు.
2019 ఎన్నికల్లో జనసేన-టీడీపీ విడివిడిగా పోటీచేయడం.. రెండు పార్టీలూ మైనారిటీలకే టికెట్ ఇవ్వడంతో ఓట్లు బాగా చీలిపోయాయి. టీడీపీ తరపున పోటీ చేసిన నజీర్‌కు 54956ఓట్లు రాగా, జనసేన తరఫున పోటీకి దిగిన షేక్ రెహమాన్‌కు 22 వేల ఓట్లు వచ్చాయి. ఇక, వైసీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్న ముస్తఫాకు 77 వేల ఓట్లు వచ్చాయి. అయితే.. వచ్చే ఎన్నికల్లో జనసేన + టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే.. ఓట్లు చీలకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తే.. టీడీపీ ఇక్కడ బోణీ కొట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates