ఒక వేలును చూపేటప్పుడు మిగిలిన నాలుగు వేళ్లు మన వైపు చూపిస్తాయన్న చిన్న విషయాన్ని మరిచి.. రాజకీయ శత్రుత్వంలో గీత దాటేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం బర్రెలక్క పేరును వాడేస్తూ.. పవన్ మీద వేసిన పంచ్ లు.. ఇప్పుడు బూమరాంగ్ అయ్యాయి. బర్రెలక్కను పొగిడేస్తూ.. పవన్ ను తెగనాడే జగన్ ధోరణి ఏ మాత్రం సరికాదంటూ ఆమే స్వయంగా వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు జగన్ అండ్ కోకు మింగుడుపడని రీతిగా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీని.. ఆ పార్టీకి వచ్చిన ఓట్ల గురించి ప్రస్తావించిన ఏపీ సీఎం జగన్.. నా చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిననన్ని ఓట్లు కూడా జనసేనకు రాలేదంటూ సెటైర్లు వేస్తూ పవన్ మీద ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఏపీ సీఎం జగన్ పవన్ ను ఉద్దేశించి విమర్శలు చేసే క్రమంలో తన ప్రస్తావన తీసుకురావటంపై బర్రెలక్క స్పందించారు.
‘ఎవరి పార్టీ వారిది. ఎవరి రాజకీయ జీవితం వారిది. పవన్ కల్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడటం బాధగా అనిపించింది. ఆయన పవర్ ఆయనది. నా పవర్ నాది. నేను కూడా పవన్ అభిమానిని. ఆయన ఎంత మంచోడో జనాలకు తెలుసు. ఆయన్ను తక్కువ చేసి మాట్లాడటం కోసం నాతో పోల్చటం బాధగా ఉంది. పవన్ కల్యాణ్ గ్రేట్ పర్సన్. ఆయన్ను నేను ఎంతో అభిమానిస్తాను. ఆయన్ను మైనస్ చేయటం కోసం నా ప్రస్తావన తీసుకురావటం మంచిది కాదు’ అని వ్యాఖ్యానించారు.
బర్రెలక్క వ్యాఖ్యలపై జనసైనికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ పై అనవసరంగా నోరు పారేసుకున్న సీఎం జగన్ కు ఇదే సరైన సమాధానమని పేర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ప్రోగ్రాంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. తెలంగాణలో జనసేన పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు సాధించలేకపోయిందన్న ఆయన.. “కనీసం కొల్లాపూర్ లో బర్రెలక్క కు వచ్చినన్ని ఓట్లు తెచ్చుకోలేకపోయాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను తెలంగాణలో పుట్టనందుకు బాధ పడుతున్నట్లు పవన్ చెప్పటం తాను ఆశ్చర్యపోయినట్లు” జగన్ విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్ వ్యాఖ్యలకు కాస్త ఆగి మరీ స్పందించిన బర్రెలక్క వ్యాఖ్యలతో హుషారు తెచ్చుకున్న జనసైనికులు జగన్ అండ్ కో మీద ఫైర్ అవుతున్నారు. బర్రెలక్కకు ఇండిపెండెంట్ గా పోటీ చేసే దమ్ము ఉందని.. తెలంగాణలో పోటీ చేసే దమ్ము జగన్ కు.. వైసీపీకి లేదంటూ ధ్వజమెత్తుతున్న వైనం ఇప్పుడు మరింత ఎక్కువైంది. ఇదంతా చూసినోళ్లు.. బర్రెలక్క ప్రస్తావన తీసుకురావటం ద్వారా సీఎం జగన్ తప్పు చేశారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates