జనసేన ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు నాగబాబు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నావి ఓటు కష్టాలు అంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. తన సొంత రాష్ట్రమైన ఏపీలో ఓటు వేసేందుకు ప్రయత్నిస్తుంటే.. వైసీపీ నాయకులు అడ్డుకుంటు న్నారని చెప్పారు. ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఓటు వేయాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఓటును తాను తన కుటుంబం రద్దు చేసుకుందని తెలిపారు. ఈ క్రమంలో మంగళగిరి పరిధిలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. అయితే.. ఇక్కడ ఓటు హక్కురాకుండా బూత్ లెవల్ స్థాయిలో కూడా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని నాగబాబు చెప్పారు. టీడీపీ – జనసేన పొత్తు రానున్న ఎన్నికల్లో తమను అధికారానికి చేరువ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లాలను కేంద్రంగా చేసుకుని జనసేన అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా పర్యటిస్తున్న నాగబాబు.. ఇక్కడి అభ్యర్థుల విషయంపై ఆరా తీస్తున్నారు. నివేదికలు తెప్పించుకుని.. వాటిని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీతో కలిసి వెళ్లాలని కూడా ఆయన నాయకులకు హితవు పలుకుతున్నారు. ఇక, టీడీపీ జనసేన మధ్య క్షేత్రస్థాయిలో విభేదాలు ఉన్న విషయం వాస్తవమేనని నాగబాబు చెప్పారు.
ఇక, వచ్చే ఎన్నికల్లో నాగబాబు కాకినాడ ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంపైనా స్పందించారు. “నాకు పదవులపై ఇంట్రెస్ట్ లేదు. ఎంపీగా పోటీ చేస్తున్నా అనేది రూమర్ మాత్రమే. ఎంపీలేదు..గింపీ లేదు. నేను కూడా వీళ్లలాంటి(జనసేన కార్యకర్తలు) వాడినే“ అని వ్యాఖ్యానించారు. ఇక, జనసేన, టీడీపీల మధ్య పలు అంశాల్లో విబేధాలు ఉండొచ్చునని వ్యాఖ్యానించారు. వాటిని క్షేత్రస్థాయిలో మాట్లాడుకుని పరిష్కరించుకుంటామన్నారు.
నెల్లూరులో జనసేన నుంచి అభ్యర్థి పోటీ చేస్తారని చెప్పారు. “వైనాట్ 175 అని వైసీపీ వాళ్లు అంటున్నారు.. వై నాట్ వైసీపీ జీరో అని మేం అంటున్నాం. నియంతృత్వ పోకడలతో వెళ్తున్న సీఎం జగన్ కు ప్రజలు ఈ ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారు. నిజమైన నాయకుడు ప్రతిపక్షం ఉండకూడదు అనే ఆలోచన చేయడం మంచిదికాదు. త్వరలో జరిగే ఎన్నికల్లో మేం గెలవబోతున్నాం. వైసీపీ 20 – 25 సీట్లతో ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నాం” అని నాగబాబు అన్నారు.