మాటలతోనే కుళ్ళబొడవటం అంటే ఏమిటో తెలంగాణా అసెంబ్లీలో కేటీయార్ , హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎంఎల్ఏలందరికీ అర్ధమయ్యుంటుంది. కేసీయార్ పదేళ్ళ పరిపాలనలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అవినీతి తదితారాలపై రేవంత్ తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తు సుదీర్ఘంగా మాట్లాడారు. రేవంత్ మాటలను తట్టుకోలేక కేటీయార్, బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో కొందరు అడ్డుపడ్డారు. దాంతో కాంగ్రెస్ ఎంఎల్ఏల్లో కొందరు బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసి బయటకు పంపేయమని సలహా ఇచ్చారు.
దానికి వెంటనే రేవంత్ స్పందించారు. స్పీకర్ ను ఉద్దేశించి ‘సభనుండి బీఆర్ఎస్ ఎంఎల్ఏలను ఎవరినీ సస్పెండ్ చేసి బయటకు పంపోద్ద’ని రిక్వెస్టు చేశారు. ‘కేసీయార్ పాలనలోని కఠోసత్యాలను తాము వివరిస్తామని, వాటిని వాళ్ళు సభలో కూర్చుని వినాలని, అదే వాళ్ళకి శిక్ష’ అని రేవంత్ అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను తాము వినిపిస్తుంటే వాళ్ళు సభనుండి వెళిపోతే ఎలాగంటు రేవంత్ ప్రశ్నించారు. అన్నట్లుగానే విద్యుత్ శాఖ, సివిల్ సప్లైస్ శాఖల్లో జరిగిన వేలాది కోట్ల రూపాయల అప్పులను ప్రస్తావించారు.
వరి వేసుకుంటే ఉరే అని పదేపదే రైతులకు వార్నింగిచ్చిన కేసీయార్ తన ఫాం హౌస్ లో మాత్రం వరిపండించిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. పదేళ్ళల్లో ఆత్మహత్యలు చేసుకున్న 8 వేల రైతుల లెక్కచెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించబోతున్నట్లు ప్రకటించారు. 24 గంటల విద్యుత్ సరఫరాపై కేసీయార్, కేటీయార్, హరీష్ చెప్పినవన్నీ అబద్ధాలే అని చెప్పారు. అలాగే కోటి ఎకరాలకు సాగునీరు కూడా అబద్ధమే అన్నారు.
రైతుల ఆదాయం పెంపులో తెలంగాణా 25వ స్ధానంలో ఉందన్న కేంద్రప్రభుత్వ నివేదికను చదివి వినిపించారు. రైతుల ఆత్మహత్యల్లో రెండు మూడు స్ధానాల్లో ఉన్న విషయాన్ని లెక్కలతో సహా చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పట్లో ఎంతగా ఇబ్బందులు పడ్డారన్న విషయాన్ని రేవంత్ సభలో వివరించారు. రైతు బీమా స్కీమ్ లో 2018 నుండి 1.21 లక్షల మంది రైతులు చనిపోయిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. కేసీయార్ పాలనలోని డొల్లతనాన్ని పాయింట్ బై పాయింట్ రేవంత్ మాట్లాడటాన్ని కేటీయార్, హరీష్ తట్టుకోలేకపోయారు. మాటలతోనే కుళ్ళబొడవటం అంటే ఏమిటో కేటీయార్, హరీష్ కు అనుభవంలోకి వచ్చుంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates