పాల‌కొండ ఎమ్మెల్యే మార్పు.. వైసీపీ వ్యూహం ..!

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలోని పాల‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యే మార్పు త‌థ్య‌మ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి.. అనారోగ్యంతోపాటు గ్రాఫ్ ప‌రంగా కూడా వెనుక బ‌డ్డార‌ని పార్టీ భావిస్తోంది. దీంతో ఇక్క‌డ అభ్య‌ర్థిని మార్చేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి.. డౌన్ టు ఎర్త్ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తారు. అందరితోనూ క‌లుపుగోలుగా ఉంటారు.

వైసీపీ కోసం ఆమె అనేక రూపాల్లో క‌ష్ట‌పడ్డారు. పార్టీని ముందుకు న‌డిపించ‌డంలోనూ కీల‌క భూమిక పోషించారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి గెలిచిన క‌ళావ‌తి.. వాస్త‌వానికి 2009లోనే రాజ‌కీయ అరంగేట్రం చేశారు. అప్ప‌ట్లో ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. మూడో స్థానంలో నిలిచారు. అయిన‌ప్ప‌టికీ.. ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగారు. ఇదే.. ఆమెకు త‌ర్వాత రెండు సార్లు విజ‌యాన్ని తీసుకువ‌చ్చింది.

అయితే.. వైసీపీలో ఉన్న‌ప్ప‌టికీ గుర్తింపు లేద‌నే భావ‌న‌.. మ‌రోవైపు అనారోగ్యం కార‌ణాల‌తో ఆమె చురుగ్గా వ్య‌వ‌హ‌రించ‌లేక పోతున్నారు. పార్టీలోనూ ఆమెకు త‌గిన ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని భావిస్తున్నారు. వాస్త‌వానికి ఎస్టీ కోటాలో క‌ళావ‌తికి మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆశించారు. కానీ, కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి ద‌క్కింది. త‌ర్వాత రెండో సారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగిన‌ప్పుడు కూడా క‌ళావ‌తి ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, అప్పుడు కూడా మొండి చేయే ఎదురైంది.

ఈ నేప‌థ్యంలో క‌ళావ‌తి కూడా.. పోటీకి అంత‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు.. ఆర్థికంగా కూడా క‌ళావ‌తి కొన్ని ఇబ్బందుల్లో ఉన్నార‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. మొత్తంగా ఇటు పార్టీ ప‌రంగాను, అటు ఎమ్మెల్యే ప‌రంగానూ పాల‌కొండ‌లో అభ్య‌ర్థిని మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నేది పెద్ద ఎత్తున జ‌రుగుతున్న చ‌ర్చ‌. మ‌రోవైపు టీడీపీ ఇక్క‌డ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఏదేమైనా.. రెండు సార్లు గెలిచిన నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఇప్పుడు అభ్య‌ర్థికోసం వేచి చూస్తుండ‌డం గ‌మ‌నార్హం.