జనసేనా.. మాకొద్దు బాబోయ్

బీజేపీ మాట మార్చింది. రూటు మార్చింది. జనసేనతో పొత్తు విషయంలో ప్లాన్ మార్చింది. తెలంగాణలో జనసేనతో ఒరిగేదేమీ లేదని భావించిన ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కరివేపాకులా తీసిపారేస్తూ.. ఆ పార్టీతో పొత్తు వద్దంటే వద్దని చాలా స్పష్టంగా చెప్పేసింది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే బరిలో దిగుతోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ ఎలాంటి పొత్తులు ఉండవని కూడా తేల్చి చెప్పేశారు. అంటే జనసేనను దూరం పెట్టేసినట్లే. బీజేపీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాన కారణమని చెప్పాలి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా జనసేనకు 8 సీట్లు కేటాయించింది. అంతే కాకుండా బీజేపీ అభ్యర్థుల కోసం పవన్ కూడా ప్రచారం నిర్వహించారు. కానీ ఫలితం మాత్రం శూన్యం.

పోటీ చేసిన 8 స్థానాల్లో జనసేనకు దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఇక బీజేపీ గెలిచిన 8 సీట్ల వెనుక జనసేన ప్రభావం ఏమంత లేదనే చెప్పాలి. దీంతో జనసేనతో లాభం కంటే నష్టమే ఎక్కువనే భావనతో బీజేపీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు అనవసరంగా తెలంగాణ ఎన్నికల బరిలో దిగిన పవన్ తన పార్టీ పరువును తానే తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ప్రచారం నిర్వహించలేదు. ఒకట్రెండు సభలు, సమావేశాలకే పవన్ పరిమితమయ్యారు. అందులోనూ కేసీఆర్ ను కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ పల్లెత్తు మాట అనలేదు. దీంతో పవన్ కంటే స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క నయమనే విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పుడు తెలంగాణలో జనసేనతో బంధాన్ని బీజేపీ తెంచుకుంది. మరి ఏపీలోనూ బీజేపీ ఒంటరిగా సాగుతుందా? లేదా అక్కడ జనసేన ప్రభావం ఉంటుంది కాబట్టి పొత్తులోనే ఉంటుందా? అన్నది వేచి చూడాలి.