జ‌గ‌న్ నిర్ణ‌యంతో ల‌క్కు చిక్కుతున్న‌ మ‌హిళా నేత‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యంతో కొంద‌రు మ‌హిళా నాయ‌కుల‌కు ల‌క్కు చిక్కుతోంద‌నే చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఖాళీగా ఉన్న ఒక‌రిద్ద‌రు నాయ‌కురాళ్లు.. వ‌చ్చే ఎన్నికల్లో టికెట్లు పొందే చాన్స్ ఉంద‌ని సంబ‌ర ప‌డుతున్నారు. వీరిలో ప్ర‌ధానంగా క‌ర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు వినిపిస్తోంది. 2014 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన రేణుక‌.. విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. 2017-18 మ‌ధ్య టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. పార్టీ మార‌క‌పోయినా.. అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు పాల్గొన్న స‌భ‌ల‌కు ఆమె హాజ‌రు కావ‌డంతో పార్టీ మారుతున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. దీంతో వైసీపీ అప్ప‌టికే అభ్య‌ర్థిని ఖ‌రారు చేసేసింది. దీంతో బుట్టా రేణుక పార్టీలోనే ఉన్నా.. టికెట్ ద‌క్కించుకో లేక పోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఆమె పార్టీ కోసం ప్ర‌చారం చేస్తున్నారు. టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు కూడా సాగిస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఆమె పేరును ప‌రిశీల‌న‌లోకి తీసుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో ప్రచారం జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నికల్లో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గాన్ని బుట్టా రేణుక‌కు కేటాయించాల‌ని దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఇక‌, గుంటూరు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఓ కీల‌క మ‌హిళా నేత వైపు పార్టీమొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. వినుకొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014లో పోటీ చేసిన న‌న్న‌ప‌నేని సుధ‌.. అప్ప‌టి ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.

అయితే, ఇప్పుడు మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమెకు టికెట్ ఇచ్చే దిశ‌గా పార్టీ దృష్టి పెట్టింది. క‌మ్మ సామాజిక వ‌ర్గం మొత్తం ఆమెకు అనుకూలంగా ఉండ‌డం.. సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడిపై వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌న్న స‌మాచారంతో పార్టీ అలెర్ట్ అయింది. ఈ క్ర‌మంలో బొల్లాను ప‌క్క‌న పెట్టి.. న‌న్న‌ప‌నేనికి టికెట్ ఇవ్వ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రో వైపు.. ఆమె ఇప్ప‌టికే పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇలా.. మ‌రికొంద‌రికి కూడా పార్టీ చాన్స్ ఇస్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.