ఎన్నికలకు నాలుగు మాసాల గడువు ఉండగానే ఏపీలో ఓట్ల రాజకీయం ఊపందుకుంది. అధికార పార్టీ వైసీపీపై ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేనలు నిప్పులు చెరుగుతున్నాయి. తమ ఓట్లు తొలగిస్తున్నారని.. దొంగ ఓట్లు చేరుస్తున్నారన్నది ఈ రెండు పార్టీల ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ కూడా సంధించారు. ఈ వారంలోనే ఆయన ఎన్నికల సంఘాన్ని నేరుగా కలవాలని అనుకున్నారు. కానీ.. ఈ పర్యటన వాయిదా పడింది.
ఇక, జనసేన నాయకులు కూడా రాష్ట్ర ఎన్నికల అధికారులకు దొంగ ఓట్లపై ఫిర్యాదులు చేశారు. తమకు అనుకూలంగా ఉన్నారనే కారణంగా..అనేక మంది ఓట్లను తొలగించారని ఆధారాలతో సహా పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ ఎన్నికల కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు ఉద్దేశ పూర్వకంగా నే ఓట్లు తొలగించాలని కోరుతూ.. ఫాం-7లు దాఖలు చేస్తున్నారని కూడా ఆరోపించారు. మరోవైపు వైసీపీ కూడా ఇదే వాదనను తెరమీదికి తెచ్చింది.
తమ పార్టీ అనుకూల, సానుభూతి ఓట్లను ఈ రెండు పార్టీలు ఫాం-7 ద్వారా తొలగిస్తున్నారని ఆ పార్టీ కూడా ఫిర్యాదులు చేసింది. అయితే.. వీటిపై రాష్ట్రస్థాయిలో అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నారు. అయి నప్పటికీ.. సంతృప్తి చెందని అన్ని పార్టీలూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి వివిధ రూపాల్లో ఫిర్యాదులు సమ ర్పించాయి. మరో నాలుగు మాసాల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఫిర్యాదుల గుట్టలు చూసి ఎన్నికల సంఘం తలపట్టుకుంది.
అధికార పార్టీ ప్రతిపక్షాలపైనా.. ప్రతిపక్షాలు అధికార పార్టీపైనా పరస్పరం చేసుకున్న ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని నియమించింది. ఈ బృందం వచ్చే వారంలో ఏపీలో పర్యటించి.. అసలు ఏం జరుగుతోందనే విషయంపై ఆరా తీయనుంది. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదులు.. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.