గిడుగు వారి పిడుగు లాంటి నినాదం: ‘వైనాట్ ఏపీ’

వైసీపీ ప్ర‌క‌టించిన ‘వైనాట్ 175’ నినాదానికి ప్ర‌జ‌ల్లో మంచి ఊపు క‌నిపించింది. పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు అనుకూలంగా కూడా స్పందించారు. ఇక‌, ఇదే నినాదాన్ని.. టీడీపీ కూడా అందిపుచ్చుకుని.. ‘వైనాట్ పులివెందుల‌’ అనే కొత్త నినాదాన్ని ప్ర‌క‌టించింది. ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా.. ‘వైనాట్ ఏపీ’ అంటూ నూత‌న నినాదాన్ని ప్ర‌క‌టించింది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నామ‌ని చెబుతున్నారు.

క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌లో పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌ని ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు చెబుతున్నారు. ఈ క్ర‌మం లోనే ఏపీలోనూ విజ‌యం సాధించి.. అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని అంటున్నారు. అయితే.. ఈ వైనాట్ ఏపీ అనే నినాదం బాగున్నా.. ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చేస‌రికి ఎంత మంది దీనిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తా ర‌నేది చ‌ర్చ‌గా మారింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లు ఎప్పుడో మ‌ర‌చిపోయారు. ఎక్క‌డా ఆఊసే లేదు. ధ్యాసే లేదు.

అలాంటి పార్టీని ఇప్పుడు.. అది కూడా ఎన్నిక‌లకు మూడు మాసాల ముందు.. లైన్‌లో పెట్టి.. గెలుపు గుర్రం ఎక్కేయాల‌న్నది గిడుగు వారి పిడుగు లాంటి సందేశం. కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌ట్టుమ‌ని ప‌ది మంది కార్య‌క‌ర్త‌లు కూడా లేకుండా పోయిన పార్టీ.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే… 150 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను వెతుక్కోవాల్సిన పార్టీ.. అధికారంపై మాత్రం పెద్ద పెద్ద పెను ఆశ‌లే పెట్టుకోవ‌డం ఆశ్చ‌ర్యం గా ఉంది.

తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చామ‌నో.. క‌ర్ణాక‌ట‌లో అధికారంలోకి వ‌చ్చామనో.. చెబుతున్న నాయ‌కులు.. ఏపీలో అందుకు త‌గిన ప‌రిణామాలు, ప‌రిస్థితులు ఉన్నాయా? లేదా? అనే విష‌యాన్ని వ‌దిలేసి.. ఊహాలోకాల్లో విహ‌రించేందుకు ప్ర‌య‌త్నించ‌డం అన్న‌ది .. వైనాట్ ఏపీ నినాదాన్ని ప‌ట్టుకుని వేలాడ‌డం మిన‌హా చేయ‌ద‌గింది.. చేయాల్సింది ఏమీ ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.