వచ్చేఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా ఓడించాలన్నది చంద్రబాబునాయుడు పట్టుదల. ఓడించటంలో కూడా మామూలుగా ఓడించటం కాదు. కొన్ని నియోజకవర్గాలను బాగా టార్గెట్ చేశారు చంద్రబాబు. అలాంటి నియోజకవర్గాల్లో గుడివాడ కూడా ఒకటి. గుడివాడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నాని అంటే చంద్రబాబు అండ్ కో కు బాగా మండిపోతోంది. పోయిన ఎన్నికలవరకు చంద్రబాబు చేసిన తప్పుల వల్లే టీడీపీ అభ్యర్ధులు ఓడిపోయేవారు. తప్పు ఏమిటంటే ఎన్నికకు ఒక అభ్యర్ధిని మార్చటమే. అలాగే టీడీపీ నేతల్లోనే కొందరు ప్రత్యర్ధులకు సాయంచేయటం.
అందుకనే అలాంటి తప్పులు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అవేమిటంటే టికెట్ కోసం పోటీపడుతున్నఇద్దరు నేతలు రావి వెంకటేశ్వరరావు, ఎన్ఆర్ఐ నేత వెనిగండ్ల రామును ఏకం చేయటమే. చాలాకాలంగా మాజీ ఎంఎల్ఏ రావి వచ్చేఎన్నికల కోసం కష్టపడుతున్నారు. అయితే సడెన్ గా వెనిగండ్ల నియోజకవర్గంలో ఊడిపడ్డారు. పార్టీలో చేరగానే సేవా కార్యక్రమాలతో జనాల్లో చొచ్చుకుపోయారు. దాంతో మామూలు జనాలతో పాటు పార్టీలో కొంత పట్టుసాధించారు.
తర్వాత టికెట్ కోసం పట్టుబట్టారు. అందుకనే టికెట్ విషయంలో రావి, వెనిగండ్ల మధ్య తీవ్రమైన పోటీ మొదలైంది. అనేక భేటీల తర్వాత చివరకు ఇద్దరినీ చంద్రబాబు ఏకం చేసినట్లు పార్టీవర్గాల టాక్ వినబడుతోంది. విషయం ఏమిటంటే వచ్చేఎన్నికల్లో వెనిగండ్లనే గుడివాడలో పోటీచేస్తారట. వెనిగండ్ల గెలుపుకు రావి తనవంతు పూర్తి సహకారం అందిచబోతున్నారు. పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే రావికి చంద్రబాబు ఎంఎల్సీ ఇచ్చేట్లు ఒప్పందం జరిగిందని సమాచారం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు చెప్పిందానికి ఓకే చెప్పక రావికి కూడా వేరే దారిలేదు. నిజంగానే వెనిగండ్ల గెలుపుకు రావి పనిచేస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఇద్దరి జాయింట్ బలమైన కోరిక ఏమిటంటే కొడాలి నాని ఓటమే. కొడాలిని ఓడించాలంటే చాలా సమీకరణలు సానుకూలమవ్వాలి. ఎందుకంటే నాలుగు ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్న కారణంగా కొడాలి పాతుకుపోయున్నారు. కొడాలిని ఓడించటం అంత తేలికైన విషయం కాదు. పార్టీ నేతలు మొత్తం సిన్సియర్ గా పనిచేయటమే కాకుండా జనాలు కూడా సహకరిస్తేనే చంద్రబాబు కల నెరవేరుతుంది.