ఉచిత విద్యుత్ పథకంపై జగన్ సంచలన నిర్ణయం

ఏపీలో చాలాకాలంగా అనేక ఉచిత పథకాలు అమల్లో ఉన్నాయి. ఆరోగ్య శ్రీ, ఫీజు రీ ఇంబర్స్ మెంట్…ఇలా అనేక పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి ప్రజలు లబ్ధి పొందుతున్నారు. అయితే, ఈ పథకాలలో ప్రభుత్వం నుంచి ఎంత నగదు లబ్ధి పొందారో లబ్ధిదారులకు కచ్చితంగా తెలుస్తుంది. ఇక, ప్రస్తుతం జగన్ సర్కార్ అమలు చేస్తోన్న ప్రతి పథకం ద్వారా లబ్ధిదారులు ఎంత మొత్తంలో లబ్ధి పొందుతున్నారో తెలిసిపోతోంది. ఆయా పథకాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి లబ్ధిదారులకు ప్రభుత్వాన్ని గుర్తు చేస్తుంది. ఇక, అలాంటి నగదు బదిలీ పథకాల ద్వారా ప్రభుత్వానికి మైలేజ్ వస్తుంది. కానీ, ఏపీలో ట్రెండ్ క్రియేట్ చేసిన ఉచిత విద్యుత్ పథకంలో మాత్రం రైతులు ఎంత మొత్తంలో లబ్ధి పొందుతున్నారో తెలిసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై, రాష్ట్రంలో ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఆ మీటర్ల నెలవారీ బిల్లులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని నిర్ణయించింది. రైతుల పొలాల్లోని స్మార్ట్ మీటర్లకు అయ్యే బిల్లుల మొత్తాన్ని డిస్కంలకు చెల్లించేలా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పథకం కోసం ప్రతి ఏటా రూ.8409 కోట్లు ఖర్చ చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధిపడింది.

ఏపీలో రైతులకు 9 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తోంది ప్రభుత్వం. రైతుల పొలాల్లోని మోటర్లకు విద్యుత్ సరఫరా చేస్తోన్న కనెక్షన్‌లకు మీటర్లు లేవు. అయితే, వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి వ్యవసాయ కనెక్షన్‌కు స్మార్ట్ మీటర్ బిగించి బిల్లులు జారీ చేయబోతున్నారు. ఆ బిల్లు మొత్తానికి సరిపడా నగదును నేరుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తుంది. ఆ డబ్బును విద్యుత్ పంపిణీ సంస్థలకు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి తాము ఎంత సాయం పొందుతున్నామో రైతులకు తెలుస్తుంది. అదే సమయంలో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని రైతులు డిమాండ్‌ చేయవచ్చు. ఇక, ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకమూ డబ్బు రూపంలో అందేలా ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతిరూపాయి వారికి గుర్తుండేలా జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. అయితే, కొన్ని సందర్భాల్లో ముందుగా రైతు కరెంటు బిల్లు చెల్లించాక వారికి డబ్బులు అందే పరిస్థితులు ఏర్పడవచ్చు. అదే సమయంలో వ్యవసాయ కనెక్షన్లు కాని అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించవచ్చు. దీని వల్ల ఖజానాకు కొంత ఆదాయం వస్తుంది. ఈ కొత్త పథకం వల్ల రైతుకు కొత్తగా ఏ ప్రయోజనం చేకూరదు. కానీ, ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి రెండు రకాలుగా లాభం చేకూరేలా జగన్ సూపర్ ఐడియా వేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కానీ, కరోనా నేపథ్యంలో ఆత్మనిర్భర ప్యాకేజీ నిధులు.. ఎఫ్‌ఆర్‌బీఎం సవరణ చట్టానికి కేంద్రం ఆమోదం పొందాలంటే ఏపీ ప్రభుత్వం కొన్ని సంస్కరణలు అమలు చేయాలి. విద్యుత్ సబ్సిడీలు ఎత్తివేయడం వంటి వాటికి ఏపీ సర్కార్ అంగీకరించడంతోనే ఉచిత విద్యుత్ పథకానికి మార్పులు చేసిందని ప్రచారం జరుగుతోంది. ఆ పథకం పూర్తిగా ఎత్తివేస్తే ఇబ్బంది కనుక…దానిని నగదు బదిలీ పథకంగా మార్చారని టాక్ వస్తోంది. అయితే, ప్రభుత్వ చెల్లింపుల్లో కొంత జాప్యం ఉంటుందని, ఈ లోపు కరెంటు బిల్లు తామే కట్టుకోవాలన్న ఆందోళన రైతుల్లో ఉంది. ఇప్పటికే విద్యుత్ సబ్సిడీలను డిస్కంలకు తిరిగి చెల్లించడంలేదన్న ఆరోపణలున్నాయి. డిస్కంలకే చెల్లించని ప్రభుత్వం…రైతులకు నెలనెలా జమచేయడంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఏదైనా కారణాలతో ఒకటి రెండు నెలలు ప్రభుత్వం నగదు బదిలీ చేయకపోతే… రైతులే ఆ బిల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. మరి, ఈ పథకం విషయంలో జగన్ సర్కార్ ఎంత కచ్చితంగా ఉంటుందో వేచి చూడాలి.