టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటించారు. దాదాపు మూడు మాసాలకుపైగా గ్యాప్‌తో ఆయన ఈ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న రాజకీయ పరిణామాలపై చంద్రబాబు దృష్టి పెట్టారు. వైసీపీ దూకుడు, ఇక్కడ కార్యకర్తలపై కేసులు.. ముఖ్యంగా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల ఆగడాలు వంటివాటిపై ఆయన చర్చించారు.
ప్రస్తుతం ఇక్కడ చంద్రబాబు నివాసం నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. దీనిపై కూడా ఆయన సమీక్షించారు. నిర్మాణ పనులు ఎంత వరకు వచ్చాయని ప్రశ్నించారు. వచ్చే సంక్రాంతి తర్వాత.. దానిని ప్రారంభించేందుకు రెడీ చేయాలని సూచించారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే తాను పోటీచేస్తున్నానని.. గతంలో మాదిరిగా కాకుండా.. వైసీపీకి బుద్ధి చెప్పేలా.. లక్ష మెజారిటీ సాధించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆ దిశగా నాయకులు క్షేత్రస్థాయిలో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు.
కుప్పంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని అధినేతకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వివరించారు. అడుగడుగునా.. కార్యకర్తలను వైసీపీ నాయకులు వేధిస్తున్నారని తెలిపారు. అయినా.. వాటిని దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరింత దీటుగా పనిచేస్తామని శ్రీకాంత్ వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ., కుప్పంలో లక్ష మెజార్టీ దిశగా పని చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.