తెలంగాణ గ‌డ్డం బ్ర‌ద‌ర్స్‌.. అలక?

గ‌డ్డం బ్ర‌ద‌ర్స్‌. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న గ‌డ్డం వివేక్‌, గ‌డ్డం వినోద్‌ల ప‌రిస్థితి అంత‌ర్మ‌థ‌నంలో ప‌డింది. బీజేపీ నుంచి నామినేష‌న్ల ఘ‌ట్టానికి చివ‌రి నిముషంలో కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన గ‌డ్డం వివేక్‌.. చెన్నూరు నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, కాంగ్రెస్‌లోనే ఉన్న గ‌డ్డం వినోద్ బెల్లంప‌ల్లి నుంచి గెలుపు గుర్రం ఎక్కారు. వీరికి సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్తానం ఉన్న విష‌యం తెలిసిందే.

అయితే, కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఎస్సీల కోటాలో త‌మ‌కు మంత్రిప‌దవులు ద‌క్కుతాయ‌ని బ్ర‌ద‌ర్స్ ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, వారి విష‌యాన్ని ఇటు రాష్ట్ర నాయ‌క‌త్వం, అటు జాతీయ నాయ‌క‌త్వం కూడా ప‌క్క‌న పెట్టాయి. దీంతో ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ కూడా ఇప్పుడు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. సుదీర్ఘ కాలంగా రాజ‌కీయాల్లో ఉన్న త‌మ‌కు న్యాయం చేయాల‌ని పార్టీ అదిష్టానాన్ని ఇద్ద‌రూ వేడుకుంటున్నారు.

అయితే.. వినోద్‌కు మాత్రం అవ‌కాశం ఉంద‌నే సంకేతాలు ఇచ్చిన‌ట్టు కాంగ్రెస్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. బెల్లంప‌ల్లి నుంచి విజ‌యం సాధించిన వినోద్‌.. కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆయ‌న ఎస్సీ సామాజిక వ‌ర్గంలో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. వివేక్ పార్టీలు మారుతార‌నే పేరు తెచ్చుకున్నా వినోద్ మాత్రం త‌న ప‌ని త‌ను చేసుకుని పోయారు. ఇక‌, అధిష్టానంతోనూ క‌లివిడిగానే ఉన్నారు.

కానీ, తెలంగాణ విష‌యంలో రాక రాక అధికారం ద‌క్కిన నేప‌థ్యంలో నేరుగా జోక్యం చేసుకునేందుకు అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. దీంతో గ‌డ్డం బ్ర‌ద‌ర్స్‌కు ఇబ్బందిగా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. రాష్ట్ర స్థాయిలో నాయ‌కుల‌తో వీరికి పెద్ద‌గా చ‌నువు లేక‌పోవ‌డం, కేవలం వెంక‌ట‌స్వామి కుమారులుగానే పేరు ఉండ‌డంతో మంత్రి వ‌ర్గంలో వీరికి తొలి ఛాన్స్ ద‌క్క‌లేదు. ఇక‌, మ‌రో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్న నేప‌థ్యంలో వినోద్ త‌న‌ను తీసుకోవాల‌ని కోరుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.