రేవంత్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా ?

కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి నెక్ట్స్ టార్గెట్ ఏమిటి ? తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలేనా ? ఎంతమాత్రం కాదని చెప్పాలి. పార్లమెంటు ఎన్నికలకన్నా ముందే జరగబోతున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుపుని రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. వేలాదిమంది పనిచేస్తున్న సింగరేణి సంస్ధ ఎన్నికల్లో గెలవటాన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. మొదటినుండి సింగరేణి ఎన్నికల్లో వామపక్షాలదే పైచేయిగా ఉండేది. అయితే తర్వాత కాంగ్రెస్ అనుబంధ కార్మిక యూనియన్ ఐఎన్టీయూసీ చక్రం తిప్పింది.

గడచిన పదేళ్ళుగా బీఆర్ఎస్ అనుబంధ సంస్ధే కీలకపాత్ర పోషిస్తోంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన సంస్ధ ఎన్నికలు ఈనెల 27వ తేదీన జరగబోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సింగరేణి విస్తరించిన విషయం తెలిసిందే. ఏ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఆ జిల్లాల్లోనే నివసిస్తుంటారు. వేలాదిమంది కార్మికులు ఓటింగ్ లోపాల్గొంటారు కాబట్టే రాజకీయపార్టీలకు సింగరేణి ఎన్నికలు బాగా ప్రతిష్టాత్మకమైపోయాయి.

ఎన్నికల్లో గెలుపుకు ఇప్పటికే గుర్తింపు సంఘం గౌరవాధ్యక్షుడి హోదాలో కేటీయార్, హరీష్ రావు కార్మికులతో చర్చలు జరిపారు. అందుకనే తొందరలోనే రేవంత్ కూడా కార్మికులతో భేటీ కావాలని డిసైడ్ అయ్యారు. ఐఎన్టీయూసీ నేతల ద్వారా పై నాలుగు జిల్లాల్లోని ఉద్యోగ, కార్మికులతో రేవంత్ భేటీ అవ్వాలని డిసైడ్ అయ్యారట. పై నాలుగు జిల్లాల పరిధిలోని 11 ఏరియాలోను ఐఎన్టీయూసీనే గెలవాలని రేవంత్ సంబంధిత నేతలకు చెప్పారట. అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన దూకుడునే ఇపుడు కూడా చూపించాలన్నది రేవంత్ ఆలోచన.

ఇప్పుడు గనుక మంచి విజయం సాధిస్తే దీని ప్రభావం తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కంటిన్యు అవుతుందని రేవంత్ నమ్ముతున్నారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల మద్దతులేకుండా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అంత ఈజీకాదు. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది, వరంగల్, ఖమ్మంలో అయితే దాదాపు ఏకపక్ష విజయాలే దక్కించుకుంది. అందుకనే సింగరేణి గుర్తింపు కార్మికసంఘం ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమే గెలవాలని రేవంత్ డిసైడ్అయ్యారట. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.