బీఆర్ఎస్ తో కటీఫ్ అయిపోయిందా ?

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో ఎంఐఎం పార్టీ కటీఫ్ చెప్పేసినట్లేనా. తాజా పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తోంది. ఎంఎల్ఏల ప్రమాణస్వీకారం విషయంలో ఎంఐఎం శాసనసభా పక్షం నేత అక్బరుద్దీన్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రోటెం స్పీకర్ గా నియమించింది. ఈ నియామకమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కారణం ఏమిటంటే బీఆర్ఎస్, ఎంఐఎం మిత్రపక్షాలుగా ఉండటమే. పార్టీలోనే సీనియర్ ఎంఎల్ఏని కాదని అక్బరుద్దీన్ను ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేయటం వెనుక రేవంత్ వ్యూహాత్మక ఎత్తుగడుందని అందరికీ అర్ధమైపోయింది.

దీనికి అదనంగా తాజాగా ఎంఐఎం ఎంఎల్ఏలందరితో రేవంత్ భేటీ అయ్యారు. తమ ప్రభుత్వానికి మద్దతివ్వమని రేవంత్ ఎంఐఎం ఎంఎల్ఏలను రిక్వెస్టుచేసినట్లు సమాచారం. అవసరమైపుడు మద్దతిస్తామని అక్బరుద్దీన్ కూడా మాటిచ్చినట్లు ప్రచారం మొదలైంది. తాజా పరిణామాలతో పదేళ్ళ బీఆర్ఎస్ తో దీస్తీకి ఎంఐఎం ఫులిస్టాప్ పెట్టేసినట్లయ్యింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 60 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను దాటాలి.

ఇపుడు కాంగ్రెస్ కు ఉన్నది కేవలం 64 సీట్లు మాత్రమే. అంటే మ్యాజిక్ ఫిగర్ కు అదనంగా 4 సీట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నది. పరిస్ధితులను గమనిస్తే ఇదేమంత సేఫ్ ప్రభుత్వం కాదనే చెప్పాలి. అందుకనే కాంగ్రెస్ బలాన్ని వీలైనంత తొందరలో వీలైనంతగా పెంచుకోవాలన్నది రేవంత్ ఆలోచనగా కనబడుతోంది. అందుకనే ముందు ఎంఐఎం ఎంఎల్ఏలతో భేటీ అయ్యారు. వీళ్ళు గనుక మిత్రపక్షంగా మారితే కాంగ్రెస్+మిత్రపక్షం బలం 71కి పెరుగుతుంది.

అప్పుడు రేవంత్ కు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుండి ఎంఎల్ఏలు ఎవరైనా మద్దతు ఇవ్వటానికి సిద్ధపడితే కాంగ్రెస్ బలం మరింతగా పెరుగుతుంది. పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు కేసీయార్ పార్టీ బలాన్ని పెంచుకున్నది ఇలాగే అని అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంఐఎం మాత్రం సేఫ్ జోన్లోనే ఉంటోంది. ఎందుకంటే తన ఏడుసీట్లను కాపాడుకుంటుండటమే ఎంఐఎంకి రక్షణకి ఢోకా లేకుండా పోతోంది.