ఈ సీట్లో టీడీపీ జెండా ఎగురుతుందా ?

ఇపుడిదే చర్చ పార్టీలో బాగా పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే కడప పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలని చంద్రబాబునాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే అది సాధ్యమేనా అనే చర్చ పెరిగిపోతోంది. ఎందుకంటే పార్టీ పెట్టినదగ్గర నుండి టీడీపీ 1984లో తప్ప ఇంకే ఎన్నికలోను గెలవలేదు. మొదట్లో కమ్యూనిస్టు అభ్యర్ధి వై ఈశ్వరరెడ్డి నాలుగు సార్లు గెలిచారు. తర్వాత కాంగ్రెస్ మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు వీ రామిరెడ్డి, కందుల ఓబుల్ రెడ్డి గెలిచారు.

మధ్యలో 1984లో టీడీపీ అభ్యర్ధిగా డీఎన్ రెడ్డి గెలిచారు. తర్వాత నుండి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నాలుగుసార్లు, ఆ తర్వాత సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి రెండుసార్లు, ఆ తర్వాత రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి గెలిచారు. గడచిన రెండు ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డే గెలిచారు. దాంతో కడప లోక్ సభ అంటేనే వైఎస్ ఫ్యామిలీ సొంతమన్నట్లుగా అయిపోయింది. అలాంటి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే టీడీపీని గెలిపించుకోవాలన్నది చంద్రబాబు పట్టుదల.

ఇపుడు కడప పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులరెడ్డినే వచ్చే ఎన్నికల్లో పోటీచేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఆయన భార్య మాధవీరెడ్డిని కడప అసెంబ్లీకి పోటీచేయించబోతున్నారనే ప్రచారం బాగా ఊపందుకుంది. ఇదే సమయంలో మిగిలిన నియోజకవర్గాల్లో ఎవరిని పోటీచేయిస్తారనే విషయం ఫైనల్ కాలేదు. అసెంబ్లీకి ఎవరు పోటీచేస్తారనేదానిపైన పార్లమెంటు అభ్యర్ధి గెలుపు ఆధారపడుంటుంది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై ఆరోపణలు, ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉందని, వైసీపీలో కుమ్ములాటలు పెరిగిపోతున్న కారణంగా పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ గెలుపుకు కలిసొచ్చే అంశాలని తమ్ముళ్ళు ఆశాభావంతో ఉన్నారు. అయితే వైసీపీని తక్కువ అంచనా వేసేందుకు లేదు. ఎందుకంటే కడప అంటేనే వైఎస్ కుటుంబానికి కంచుకోటని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాగే అవినాష్ కూడా బాగా జనాల్లో చొచ్చుకుపోయారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని నేతలు, క్యాడర్ తో పాటు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, అభివృద్ధే తనను గెలిపిస్తాయని అవినాష్ అనుకుంటున్నారు. మరి చివరకు ఏమి జరగుతుందో చూడాలి.