ష‌ర్మిల విష‌యంలో కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం?

Sharmila

తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తెస్తానంటూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్ త‌న‌య ష‌ర్మిల పాదాల‌తో న‌డిచే పాద‌యాత్ర చేసినా.. పార్టీని పుంజుకునేలా చేయ‌డంలో ఒకింత వెనుక‌బ‌డ్డార‌నే వాద‌న ఉంది. ఈ క్ర‌మంలో ఉభ‌యకుశ‌లోప‌రిగా.. ఆమె త‌న వ్యూహానికి ప‌దును పెట్టి.. ఎన్నిక‌ల వేళ పోటీ నుంచి త‌ప్పుకొని కాంగ్రెస్కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. తాను కూడా బ‌రిలో నిలిస్తే.. కేసీఆర్ మ‌ళ్లీ విజ‌యం ద‌క్కించుకుంటార‌ని.. అందుకే.. తాను పోటీ నుంచి త‌ప్పుకొని కాంగ్రెస్‌కు ద‌న్నుగా మారాన‌ని వెల్ల‌డించారు.

ఇది నిజ‌మో కాదో.. తెలియదు కానీ.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇప్పుడు ష‌ర్మిల విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆమె విష‌యాన్ని పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తున్న‌ట్టు హైద‌రాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ‌లో తెర‌చాటునైనా త‌మ‌కు స‌హ‌క‌రించింద‌న్న కృత‌జ్ఞ‌త‌తో ఇప్పుడు షర్మిలకు ప్రాధాన్యం ఇచ్చే అంశాన్ని పార్టీ ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. ఆమెను రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు.

క‌ర్ణాట‌క నుంచి ష‌ర్మిల‌ను రాజ్య‌స‌భ‌కు పంపించి.. అక్క‌డ ఆమె గ‌ళం వినిపించే ప్రాధాన్యం ఇవ్వ‌నున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదేస‌మ‌యంలో ఏపీలోనూ పార్టీ త‌ర‌ఫున ఆమె వ్యూహాత్మ‌కంగా వినియోగ ప‌డేలా పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం ప్లాన్ చేస్తోంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను ముఖ్యంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ష‌ర్మిల‌కు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ఇటీవ‌ల ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గిడుగు రుద్ర‌రాజు కూడా.. ష‌ర్మిల వ‌స్తే ఏపీలో బాధ్య‌త‌లు అప్ప‌గిస్తామ‌ని చెప్పారు. ఇప్పుడు ఇదే విష‌యంపై పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం చ‌ర్చ‌లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఆమెను ఎప్పుడు రంగంలోకి దింపుతారు? ముందుకు రాజ్య‌స‌భ‌కు పంపుతారా? లేక ఏపీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారా? అనేది చూడాలి. మొత్తానికి ష‌ర్మిల విష‌యంపై మాత్రం కాంగ్రెస్ అగ్ర‌నాయ‌క‌త్వం దృష్టి పెట్టింద‌నేది విశేషం.