జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ అధికార పార్టీ వైసీపీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇక, యుద్ధం చేయక తప్పదు” అని హెచ్చరించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అరెస్టును ఆయన ఖండించారు. నాదెండ్ల అరెస్టు అప్రజాస్వామికమని, విశాఖలోని టైకూన్ జంక్షన్ వద్ద రోడ్డును తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా అని నిప్పులు చెరిగారు. జనసేన శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని పవన్ మండిపడ్డారు.
నాదెండ్లతో పాటు అరెస్టు చేసిన మిగతా జనసేన నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోతే ‘విశాఖ వస్తా.. పోరాడుతా..ఇక, యుద్ధమే!’ అని పవన్ హెచ్చరించారు. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు వాస్తుదోషం ఉందనే కారణంగా రోడ్డు మూసేయడం ఎంత వరకు సమంజసమని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను పోలీసుల బూట్లతో అణిచి వేస్తారా? అని నిలదీశారు.
ఏం జరిగింది?
విశాఖపట్నంలోని కీలకమైన టైకూన్ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. దీనిపై జనసేన ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు. వీరికి మద్దతు తెలిపేందుకు బయల్దేరిన నాదెండ్ల మనోహర్‌ను ఆయన బస చేసిన నోవాటెల్ హోటల్ వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హోటల్ గేటు వద్దే బైఠాయించి నిరసన తెలుపుతున్న నాదెండ్లను పోలీసులు అరెస్టు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates