రేవంత్ పై ఒత్తిడి పెరిగిపోతోందా ?

రేవంత్ రెడ్డిపై అప్పుడే ఒత్తిడి మొదలైపోయిందట. ఇపుడు మొదలైన ఒత్తిడి ఏ విషయంలో అంటే ఎంఎల్సీ పదవుల విషయంలోనే. ఆరు ఎంఎల్సీ పదవులను భర్తీచేసే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. ఇందులో గవర్నర్ కోటాలో రెండు, ఎంఎల్ఏల కోటాలో మరో రెండు, స్ధానిక సంస్ధలు, పట్టబద్రుల కోటాలో ఇంకో రెండు ఎంఎల్సీ స్ధానాలు భర్తీకి అవకాశమొచ్చింది. ఎంఎల్ఏల కోటా, లోకల్ బాడీస్ కోటాలో భర్తీ చేయాల్సిన నాలుగు స్ధానాలకు కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ ఇవ్వాలి.

ఇక గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు స్ధానాలు ఎప్పుడో భర్తీ కావాల్సుంది. అయితే అప్పట్లో కేసీయార్ ప్రభుత్వం ప్రతిపాదించిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను గవర్నర్ ఆమోదించకపోవటంతో రెండు సీట్లు భర్తీ కాకుండా ఆగిపోయింది. ఇపుడు విషయం ఏమిటంటే గవర్నర్ కోటాలో భర్తీ అవ్వాల్సిన రెండు స్ధానాలపై చాలామంది సీనియర్ నేతలు కన్నేశారు. విచిత్రం ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన ఎంఎల్ఏ అభ్యర్ధులు కూడా ఇపుడు ఎంఎల్సీలుగా అవకాశాలు కావాలని గట్టిగా రేవంత్ పై ఒత్తిడి పెడుతున్నారు.

మొన్నటి ఎన్నికల్లో కేటీయార్ మీద పోటీచేసి ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, మహ్మద్ అజరుద్దీన్, ఫిరోజ్ ఖాన్ ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు పార్టీలో బాగా ప్రచారమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంఎల్ఏ టికెట్లు తమకే దక్కాలని పై నేతలు పట్టుబట్టి టికెట్లు సాధించుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోగానే భర్తీ చేయాల్సిన ఎంఎల్సీ స్ధానాల్లో తమను ఎంపిక చేయాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

అంటే అసెంబ్లీ ఎన్నికలొస్తే టికెట్లు వాళ్ళకే కావాలి, గెలిస్తే మంత్రివర్గంలో తామే ఉండాలి. ఒకవేళ ఓడిపోతే ఎంఎల్సీలుగా అవకాశాలూ తమకే దక్కాలి. ఇలాంటి నేతల వల్లే రేవంత్ పై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. మైనారిటీలకు అవకాశాలు ఇవ్వాలంటే పార్టీలో షబ్బీర్ ఆలీ, అజరుద్దీన్, ఫిరోజ్ ఖాన్ తప్ప మరొక ముస్లిం మైనారిటి నేతలు లేరా ? ఏదేమైనా నేతల్లో పెరిగిపోతున్న స్వార్ధంవల్లే పార్టీపై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. మరి చివరకు ఎంఎల్సీలుగా ఎవరు ఎంపికవుతారో చూడాలి.