వైసీపీ కీలక ఎమ్మెల్యే, మంగళగిరి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి హఠాత్తుగా ఉరుములు లేని పిడుగు మాదిరిగా వ్యవహరించి సంచలనం సృష్టించారు. తన శాసన సభ్యత్వానికి, అదేవిధంగా వైసీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. దీనిని బహుశ ఎవరూ ఊహించి ఉండరు. కాకపోతే.. అదినేత జగన్‌కు చెప్పకుండా ఆయన ఏమీ చేయరు కాబట్టి.. ఆయనకు ముందుగానే చెప్పి ఉంటారని కూడా పరిశీలకులు అంటున్నారు.
ఇదిలావుంటే.. తన రాజీనామాలో ఆళ్ల.. కేవలం ఏక వాక్యంతో స్పీకర్‌కు లేఖను సమర్పించారు. మీడియా ముందు కూడా.. ఎక్కడా పన్నెత్తు మాట ఎవరినీ ఆయన అనలేదు. అయితే.. ఇంత హఠాత్తుగా ఆయన రాజీనామా చేయడం వెనక మాత్రం కారణాలు లేకుండా ఉంటాయా? అనేది వాస్తవం. ప్రస్తుత రాజీనామా వెనుక చాలానే కారణాలు ఉన్నాయి. వీటిని ఆయన పైకి చెప్పకపోయినా.. గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు.. ఆయనను వేధిస్తున్నాయి.
ఇవీ కారణాలు!
- మంత్రి పదవి ఇస్తామని.. 2019 ఎన్నికల సమయంలో సాక్షాత్తూ జగన్ ప్రకటించి.. ఆ మాట నిలబెట్టుకోలేదు.
- రెండో సారి మంత్రి వర్గ విస్తరణ సమయంలో కనీసం అప్పాయింట్‌మెంటు కూడా ఇవ్వలేదు.
- నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం(ఇది అందరి బాధ)
- తన నియోజకవర్గంలో తన సోదరుడు, రాజ్యసభ సభ్యుడి దూకుడు పెరిగిందనే ఆవేదన.
- గతంలో మాదిరిగా పార్టీలో ఆళ్లకు ప్రాధాన్యం లేకుండా పోయింది.
- వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవి(నేత కులం-బీసీ)కి టికెట్ ఇస్తారనే ప్రచారం జరగడం.
- పార్టీ పరంగా తనకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. క్షేత్రస్థాయిలో తనపైనే పరిశీలకులను పెట్టడం.
- తాను చేస్తున్న కోర్టు పోరాటాలకు సైతం నిధులు సమకూర్చలేదన్న ఆవేదన.
- రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. తనకు సపోర్టుగా ఎవరూ లేరనే బాధ.