ఆ సీటు చంద్రబాబు ఇవ్వకుంటే ప్లాన్ బీ ఉంది: బుద్ధా

మరికొద్ది నెలల్లో ఏపీలో శాసన సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను ప్రతిపక్షాలు సరిగ్గా క్యాష్ చేసుకోగలిగితే కాంగ్రెస్ మాదిరి విజయం సాధించడం కష్టం కాదు అన్న భావన ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలలో మరింత బలంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ, జనసేనల తరఫున టికెట్లు ఎవరికి దక్కబోతున్నాయి అన్న విషయంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే తనకు విజయవాడ వెస్ట్ టికెట్ కావాలంటూ టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న సంచలన ప్రకటన చేశారు.

బీసీ అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని, ఆ సీటు తనకివ్వాలని చంద్రబాబును అడుగుతానని బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సీటు ఇస్తారన్న నమ్మకముందని, ఒకవేళ సీటు ఇవ్వకుంటే ఆప్షన్ బి కూడా ఉందని బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో జగన్ సర్కార్ కొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు. యువకులంతా వైసీపీకి పాడె కట్టాలని చూస్తున్నారని, జగన్ మళ్లీ సీఎం అయితే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పెడతారని షాకింగ్ కామెంట్లు చేశారు. మూడేళ్ళ క్రితమే కొడాలి నాని కేసినో, అశ్లీల డ్యాన్సులకు అనుమతిచ్చారని, కొడాలి నాని టీడీపీ నుంచి వెళ్లిన పిచ్చికుక్క అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ సస్పెండ్ చేస్తే వైసీపీలోకి వెళ్ళాడని నానిపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ, చంద్రబాబు జోక్యం చేసుకోలేదని, గాంధీభవన్ దగ్గర టీడీపీ జెండాలతో చంద్రబాబుకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. చంద్రబాబును విమర్శిస్తే జగన్ ను తాము విమర్శిస్తామని హెచ్చరించారు. పిచ్చి కుక్కలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సీఎందే అని, వైసీపీ వాళ్ళు కర్రలు,కత్తులు పడితే తాము కూడా అలాగే సమాధానం చెబుతామన్నారు. సత్తా ఉంది కాబట్టి ప్రధానులను కూడా చంద్రబాబు తయారుచేశారని అన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసి రాష్ట్రం వదిలిపోయేందుకు చాలామంది వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారని, ఎక్కడకు వెళ్ళినా లాక్కొచ్చి శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు.