వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇస్తామని.. ఈ విషయంలో ఎలాంటి తర్జన భర్జనలకు తావులేదని.. టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తేల్చి చెప్పారు. ఈ విషయంలో మరోసారి తాను చెప్పేదేమీ ఉండదన్నారు. జనసేన-టీడీపీ పొత్తును ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు పార్టీ అవసరం ఎంతో ఉందన్నారు.
తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువులు నాయకులు టికెట్ల అంశాన్నిప్రస్తావించారు. ముఖ్యంగా చీరాల టికెట్‌ను జనసేనకు కేటాయిస్తున్నారన్న ప్రచారంపై బాబును ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు ఒకింత సీరియస్‌గానే స్పందించారు. ఈ విషయంలో మొత్తం తన నిర్ణయానికే కట్టుబడి ఉండాలని బాబు తేల్చి చెప్పారు.
“గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు ఇస్తాను. అంతర్గతంగా చేయించే సర్వేల్లో నాయకుల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేదు. ప్రత్యామ్నాయం చూపించి పక్కన పెడతా తప్ప పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెట్టను. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఓట్ల అవకతవకల విషయాన్ని ఇన్‌ఛార్జ్‌లు బాధ్యతగా తీసుకోవాలి. అన్నీ పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందనే అలసత్వం వద్దు” అని పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరించారు.
ప్రతి కార్యక్రమంలో తెలుగుదేశం – జనసేన నేతలు కలిసి వేదికను పంచుకోవాలని జనసైనికులకు చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయిలోనూ కలిసి పనిచేస్తూ జగన్‌ను ఇంటికి సాగనంపుదామని నాయకులకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై గ్రామస్థాయిలోనూ కలసి పోరాడాలని దిశానిర్దేశం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates