రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం తెలుగుదేశంపార్టీలో పోటీ పెరిగిపోతోంది. ఇంతకీ పెరిగిపోతున్న పోటీ ఎక్కడంటారా ? కడప జిలా రాయచోటి నియోజకవర్గంలో. ఇప్పటికి ముగ్గురు నేతలు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీ తరపున గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎంఎల్ఏగా ఉన్నారు. శ్రీకాంత్ గడచిన నాలుగు ఎన్నికల్లో గెలుస్తునే ఉన్నారు. నిజం చెప్పాలంటే శ్రీకాంత్ చాలా బలమైన నేతనే చెప్పాలి. వైసీపీ ఎంఎల్ఏని ఎదుర్కోవటం మామూలు విషయం కాదు.
ఇపుడు విషయం ఏమిటంటే టీడీపీ నుండి ముగ్గురు నేతలు టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇందులో ఆర్ రమేష్ రెడ్డి చాలాకాలంగా పార్టీలో పనిచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ తనకే అని రమేష్ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే గడచిన రెండు ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయింది రమేష్ రెడ్డే. అయితే రమేష్ కు ఒక మైనస్ ఉంది. అదేమిటంటే జిల్లా అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి భార్య మాధవీరెడ్డికి కడప అసెంబ్లీ టికెట్ ఇస్తున్నట్లు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారట. దాని ప్రకారం శ్రీను కడప పార్లమెంటుకు ఆయన భార్య అసెంబ్లీకి పోటీచేసేటపుడు మళ్ళీ తమ్ముడు రమేష్ కు రాయచోటి టికెట్ ఇస్తారా అన్నది సందేహం.
అలాగే మాజీ ఎంఎల్ఏ ద్వారకనాధరెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈయన 1994లో లక్కిరెడ్డిపల్లి ఎంఎల్ఏగా పనిచేశారు. ద్వారకనాధ్ రెడ్డి పేరు పార్టీలో ఈమధ్యనే బాగా వినబడుతోంది. రాబోయే ఎన్నికల్లో తనకే టికెట్ ఖాయమని పార్టీలో ద్వారక చెప్పుకుంటున్నారు. దాంతో నేతలు, క్యాడర్లో కాస్త అయోమయం మొదలైంది.
ఇది సరిపోదన్నట్లుగా తాజాగా మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అనే కొత్త నేత కూడా టికెట్ రేసులో ఉన్నారట. టికెట్ కోసం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు లోకేష్ తదితరుల ద్వారా మండిపల్లి ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. తనకే టికెట్ ఖాయమని తన మద్దతుదారులతో చెబుతున్నారట. మొత్తంమీద ఇక్కడ ఎవరు పోటీచేస్తారన్నది నిర్ణయించాల్సింది చంద్రబాబే. మరి ఎంపిక చేసే అభ్యర్ధి శ్రీకాంత్ ను ధీటుగా ఎదుర్కొంటారా లేదా అన్నది చూడాలి.