అసెంబ్లీలో ‘కరెంట్ వార్’ తప్పదా ?

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోయే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కరెంటు వార్ తప్పేట్లు లేదు. ఎందుకంటే ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినా ముఖ్యమైనది మాత్రం కరెంటు సరఫరా అంశమే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు ఉండదని, వ్యవసాయ కరెంటు కూడా ఉండదని కేసీయార్, కేటీయార్, హరీష్ రావులు గొంతుచించుకున్నారు. ఇదే సమయంలో కేసీయార్ ప్రభుత్వం కూడా 24 గంటల కరెంటు ఇవ్వటంలేదని రేవంత్ రెడ్డి ఎదురు దాడులకు దిగారు.

సరే ఆరోపణలు, ప్రత్యారోపణలను పక్కనపెట్టేస్తే జనాలు కేసీయార్ మాటలను నమ్మకుండా కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే రేవంత్ సమీక్షలు మొదలుపెట్టారు. ఇందులో కీలకమైనది విద్యుత్ శాఖే అని చెప్పాలి. రెండు రోజుల్లో మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కరెంటు పరిస్ధితిని హైలైట్ చేయాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. అందుకనే విద్యుత్ శాఖపై ప్రత్యేకంగా సమీక్షలు చేశారు. ఈ సమీక్షల్లో 24 గంటల కరెంటు సరఫరా అని కేసీయార్ చెప్పింది తప్పని అధికారులు అంగీకరించారట.

ఈ నేపధ్యంలోనే జిల్లాల వారీగా విద్యుత్ సరఫరా అయిన లెక్కలను రేవంత్ బయటకు తీయిస్తున్నారు. అలాగే విద్యుత్ శాఖ అప్పులు రు. 85 వేల కోట్లని ఉన్నతాధికారులు చెప్పటంతో రేవంత్ తో పాటు మంత్రులు విస్తుపోయారు. 85 వేల కోట్ల రూపాయల అప్పుల్లో విద్యుత్ శాఖ ఉన్నట్లు కేసీయార్ ఎప్పుడూ చెప్పలేదు. దాంతో అసలు వాస్తవాలను రేవంత్ ప్రభుత్వం తవ్వి తీస్తున్నారు.

ఉన్నతాధికారులు ఇచ్చిన వాస్తవాలతో అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పై రేవంత్ అండ్ కో విరుచుకుపడటం ఖాయం. దాంతో బీఆర్ఎస్ కూడా ఎదురుదాడులకు రెడీ అవుతోంది. తమ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటపడతాయనే కాంగ్రెస్ ను గెలవనీయకుండా కేసీయార్ శతవిధాల ప్రయత్నాలు చేశారు. అయితే జనాల్లో పెరిగిపోయిన తీవ్ర వ్యతరేకతను మాత్రం గుర్తించలేకపోయారు. దాంతో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నారు. మొత్తంమీద మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే రెండు వైపుల కరెంట్ వార్ తప్పేట్లు లేదు.