ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో రెండు కీలక నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్లకు సెగ తగులుతోంది. వారి స్థానాలను జనసేన కోరుతుండడమే కాదు.. పట్టుబడుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ రెండు ఇస్తే.. గెలిచి తీసుకువస్తాం.. అంటూ తాజాగా జనసేన అధినేత పవన్ దగ్గర నాయకులు తేల్చి చెప్పారు. అవే.. ఒకటి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. రెండు అనంతపురం అర్బన్.
ఈ రెండు నియోజకవర్గాల్లోనూ జనసేన గెలుపు పక్కా అని చెబుతున్నారు. వాస్తవానికి ఈ రెండు నియోకవర్గాల్లోనూ ఒకటి టీడీపీ సిట్టింగ్ సీటు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో వైసీపీ హవా ఉద్రుతంగా ఉన్నప్పటికీ.. టీడీపీ దక్కించుకుంది. ఇక, అనంతపురం అర్బన్ టికెట్‌ను మాత్రం చేజార్చుకుంది. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను ఇవ్వాలన్న జనసేన విన్నపానికి టీడీపీకి కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
రెండు కారణాలతో ఈ రెండు స్థానాలను టీడీపీ.. జనసేనకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. వయసు పైబడడం.. ప్రజల్లోనూ ఆయనపై సానుకూలత పెద్దగా లేక పోవడం.. వైసీపీ ఇక్కడ యువ నాయకుడిని ప్రవేశ పెట్టడం వంటి కారణాలతో బుచ్చయ్యకు టికెట్ ఇచ్చినా.. ప్రయోజనం లేదని టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో ఈ సీటును వదులుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.
ఇక, అనంతపురం అర్బన్‌లో అంతర్గత కుమ్ములాటలు మరింత పెరిగాయి. జేసీ బ్రదర్స్ దివాకర్ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలకు .. ఇక్కడి టీడీపీ ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరికి మధ్య ఏళ్ల తరబడి విభేదాలు కొనసాగతున్నాయి. ఇప్పుడు వైకుంఠానికి టికెట్ ఇచ్చినా.. ప్రయోజనం లేదని భావించి.. ఆయనకు వేరే సీటు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఇక్కడ కూడా జనసేనకు టికెట్ ఖారరవుతున్నట్టు సమాచారం. ఏదైనా సంచనాలు చోటు చేసుకుంటే తప్ప.. దీనిలో మార్పు ఉండదనేది పార్టీ వర్గాల అభిప్రాయం.