మూడు మాసాల త‌ర్వాత బాబు ఎంట్రీ.. నేటి నుంచే జ‌నంలోకి!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ జ‌నంలోకి అడుగు పెట్ట‌నున్నారు. జైలు, అనారోగ్యం కార‌ణాల తో దాదాపు మూడు మాసాలుగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉన్నారు. సెప్టెంబ‌రు 3న చంద్ర‌బాబు ఏపీ సీఐడీ అధికారులు క‌ర్నూలు జిల్లాలో అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కుంభ‌కోణం కేసులో ఆయ‌న‌ను 52 రోజుల పాటు జైల్లో ఉంచారు. త‌ర్వాత బెయిల్‌పై వ‌చ్చిన చంద్ర‌బాబు.. కంటి ఆప‌రే ష‌న్ కోసం హైద‌రాబాద్‌కు వెళ్లారు. ఇక‌, సెప్టెంబ‌రు 3 నుంచి చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యారు.

అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న ప్ర‌జ‌ల‌లోకి వ‌చ్చేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక వేసుకున్నారు. శుక్ర‌వారం నుంచి ఇక‌, వ‌రుస‌గా జిల్లాల‌ పర్య‌ట‌న చేప‌ట్ట‌నున్నారు. శుక్ర‌వారం, శ‌నివారం మాత్రం మిచౌంగ్ తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించి బాధితుల‌ను ఓదార్చ‌నున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాలు .. మిచౌంత్ తుఫాను వ‌స్తుంద‌ని తెలిసినా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోవ‌డం వంటి విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌జల్లొకి బ‌లంగా తీసుకువెళ్ల‌నున్నారు.

ఇక‌, 11వ తేదీ నుంచి ఉమ్మ‌డి తూర్పు, ఉమ్మ‌డి శ్రీకాకుళం స‌హా ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేయను న్నారు. ముఖ్యంగా జ‌న‌సేన‌-టీడీపీ మిత్ర ప‌క్షానికి సంబంధించి కొంత మేర‌కు దూరంగా ఉన్న పార్టీ నాయ‌కుల‌ను చంద్ర‌బాబు స‌మ‌న్వ‌యం చేయ‌నున్నారు. పార్టీ కార్యాచ‌ర‌ణ‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించాల‌నే ల‌క్ష్యంలోనే జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్న‌ట్టు వారిని అనున‌యించ‌నున్నారు.

ఇదేక్ర‌మంలో కొన్ని సీట్ల‌ను కూడా ఖ‌రారు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా బొబ్బిలి నియోజ‌క వ‌ర్గంలో టీడీపీ వ‌ర్సెస్ టీడీపీగా ఉన్న విభేదాల‌పై ప్ర‌ధానంగా దృష్టి పెట్ట‌నున్న‌ట్టు పార్టీవ‌ర్గాలు చెబుతు న్నాయి ఈ ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు సుమారు 4 బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొంటార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. అదేస‌మ‌యంలో ఆయా జిల్లాల్లో నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌తోపాటు, స‌మ‌స్య‌లు కూడా తెలుసుకుని ప‌రిష్క‌రించ‌నున్న‌ట్టు చెబుతున్నారు.