తొలిరోజునే సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది రేవంత్ ప్రభుత్వం. అధికారాన్ని చేపట్టిన గంటల వ్యవధిలోనే నిర్వహించిన కేబినెట్ భేటీలో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో విద్యుత్ శాఖ సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తొలి కేబినెట్ భేటీలో విద్యుత్ అంశంపై సీరియస్ గా చర్చ జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని దాచిపెట్టటంపై సీరియస్ అయ్యారు.
విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందన్న ముఖ్యమంత్రి.. శుక్రవారం నాటికి పూర్తి వివరాలతో రివ్యూ మీటింగ్ కు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఉదయం విద్యుత్ పై ప్రత్యేక సమీక్షను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి.. ఈ సమావేశానికి సీఎండీగా వ్యవహరిస్తున్న ప్రభాకర్ రావు రాజీనామా చేసినప్పటికీ.. ఆయన రాజీనామాను ఆమోదించటం లేదని స్పష్టం చేశారు. ప్రభాకర్ రావు రివ్యూ మీటింగ్ కు వచ్చి.. లెక్కలు అన్ని చెప్పిన తర్వాతే ఆయన రాజీనామాను ఆమోదిస్తామని తేల్చేశారు.
విద్యుత్ శాఖలో ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు తెలియజేశారు. దీంతో.. ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రేవంత్ నిజాల్ని ఎలా దాచిపెడతారని ప్రశ్నించారు. అంతేకాదు. సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దన్న రేవంత్.. శుక్రవారం రివ్యూకు ప్రభాకర్ రావును వచ్చేలా చేయాలని అధికారులకు పేర్కొన్నారు. విద్యుత్ అంశంపై వాస్తవ లెక్కల్ని తనకు చెప్పాలన్న రేవంత్.. మొత్తం వివరాల్ని తీసుకొని రివ్యూ భేటీకి రావాలని ఆదేశించారు. ఈ అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.