ప్రభుత్వ పథకాలపై చినజీయర్ స్వామి వ్యంగ్యస్త్రాలు

అధ్యాత్మిక ప్రసంగాలు.. నాలుగు మంచి మాటలు చెప్పుకుంటూ.. పాలకులు.. వారి విధానాల మీద మాట్లాడేందుకు అస్సలు ఆసక్తి చూపని చినజీయర్ స్వాములోరు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంక్షేమ పథకాల అమలు మీద కావటం.. వాటిని అమలు చేసే ప్రభుత్వాల మీద కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఆయన.. సంక్షేమ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

క్రిష్ణా జిల్లా బావులపాడు మండలం వీరవల్లిలో విజయ డెయిరీ నూతన యూనిట్ ను ఆయన ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు రకరకాల రాయితీలు ఇస్తున్నాయన్న చినజీయర్ స్వామి ప్రజల్ని బలహీనులుగా.. బద్ధకస్తులుగా మారుస్తున్నాయని పేర్కొనటం గమనార్హం.

“ప్రభుత్వాలు రకరకాల రాయితీలు ఇస్తున్నాయి. పుడితే ఒకటి.. పోతే ఒకటి. కూర్చుంటే ఒకటి. నడిస్తే మరొకటి. పడుకుంటే ఇంకొకటి. తింటే రాయితీ. తినకపోతే రాయితీ ఇలా ప్రతిదానికీ రాయితీలు ఇస్తూ ప్రజల్ని బద్దకస్తులుగా.. బలహీనులుగా తయారు చేస్తున్నారు” అంటూ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అన్నీ మన ఇంటికే తెచ్చిస్తుంటే.. ఇంకెందుకు పని చేయాలన్నధోరణిలో ప్రజలు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యల లెక్కలేంటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.