వచ్చే ఏడాది ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని స్థానాల్లోనూ విజయం దక్కించుకుంటే.. ముఖ్యమంత్రీ పీఠాన్ని పంచుకుంటామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయన్నారు. తాజాగా విశాఖపట్నంలో జనసేన నాయకుల ఆధ్వర్యం లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కౌన్సిలర్లు.. జనసేన తీర్థం పుచ్చుకు న్నారు.
ఈ సందర్భంగా పవన్ ప్రసంగిస్తున్న సమయంలో ‘పవన్ సీఎం.. పవన్ సీఎం’ అంటూ.. పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. నినాదాలు ఆపాలని పవన్ సూచించినా.. కార్యకర్తలు ఆగలేదు. దీంతో ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నవారు.. నన్ను ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. గతంలో గాజువాక నుంచి తాను పోటీ చేస్తే.. కనీసం గెలిపించలేకపోయారని వ్యాఖ్యానించారు. అయిందేదో అయిపోయిందని.. పవన్ అన్నారు.
కనీసం వచ్చే ఎన్నికలలో అయినా.. జనసేన ఎక్కడ పోటీ చేస్తే.. అక్కడ భారీ మెజారిటీతో గెలిపిస్తే.. తనను ముఖ్యమంత్రిగా చూసుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. “మన బలం ఏంటో చూపించాలి. బలం లేకుండా.. మనకు అది కావాలి.. ఇది కావాలి అని అడిగితే ధర్మంకాదు. మీరు జనసేనను భారీ మెజారిటీతో గెలిపించడం.. ఒక్క నాయకుడు కూడా ఓడిపోవడానికి వీల్లేదు. అప్పుడు మీరు కోరుకున్నట్టు సీఎం సీటును పంచుకుంటాం. ఈ విషయంపై చంద్రబాబుతోనూ చర్చిస్తున్నా” అని పవన్ వ్యాఖ్యానించారు. దీంతో కార్యకర్తలు శాంతించారు.