తెలంగాణ ముఖ్యమంత్రిగా తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన.. రేవంత్‌రెడ్డి విషయంలో నందమూరి కుటుంబం హ్యాపీగా స్పందించింది. ఆయన పదికాలాల పాటు తెలంగాణను అభివృద్ది పథంలో ముందుకు నడిపించాలని నందమూరి ఫ్యామిలీ అభిలషించింది. ఈ మేరకు ఎన్టీఆర్ కుటుంబం సందేశం పంపించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కొత్తగా ప్రమణస్వీకారం చేసిన మంత్రులకు నందమూరి రామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి నియామకం పట్ల తనకు చాల సంతోషంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని విజయవంతంగా కొనసాగిస్తారని నందమూరి రామకృష్ణ వెల్లడించారు. తెలంగాణ కేబినెట్ మంత్రులకు పేరు పేరున అభినందనలు తెలియచేస్తున్నానని నందమూరి రామకృష్ణ చెప్పారు. ఇక, అమెరికాలో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులుకూడా రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారని రామకృష్ణ పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణ సీఎంగా బాద్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డికి టీడీపీ అధినేత, రేవంత్ కు రాజకీయ గురువుగా పేర్కొనే మాజీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో రేవంత్‌రెడ్డి ప్రజలకు సుపారిపాలన అందించాలని చంద్రబాబు ఆకాక్షించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం వెంటనే చంద్రబాబు.. ఎక్స్ వేదికగా స్పందించారు.
అదేవిధంగా నారా లోకేష్ కూడా రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వాస్తవానికి చంద్రబాబును రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అయితే.. అనివార్య కారణాలతో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దీంతో ఎక్స్ వేదికగా రేవంత్‌ను అభినందించారు. మరోవైపు.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కూడా.. రేవంత్‌కు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇరు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా పరస్పరం సహకరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.