ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎవరెవరిని పిలవాలనే విషయం ఇప్పటికే నిర్ణయమైపోయింది. ముఖ్య అతిధులకు ఆహ్వానాలు కూడా వెళ్ళాయి. అయితే ఎవరొస్తారో రారో ముహూర్తం సమయానికి బయటపడుతుంది. ఆరుగురు ముఖ్యమంత్రులకు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కేసీయార్, చంద్రబాబాబునాయుడుకి ఆహ్వానాలు అందాయి. వీళ్ళిద్దరిలో ఎవరొస్తారనే విషయంలో సస్పెన్స్ మొదలైంది. ప్రముఖులను ఆహ్వానించటంలో గొప్పేమీలేదు. ప్రతి ప్రభుత్వం చేసేదిదే. అయితే ఇపుడు కొత్తదనం ఏమిటంటే తెలంగాణా ఉద్యమంలో అమరులైన మూడు వందల మంది కుటుంబాలను ఆహ్వానించటమే.
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రభుత్వం నుండి అమరుల కుటుంబాలకు ప్రత్యేకంగా ఆహ్వానాలు అందటమే ఇక్కడ ముఖ్యం. కేసీయార్ గడచిన పదేళ్ళల్లో అసెంబ్లీలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో ఇంతమంది అమరులయ్యారని కూడా తెలంగాణా ఏర్పాటులో వీళ్ళ భాగస్వామ్యం ఉందని ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పుడు మాట్లాడినా తాను నిరాహారదీక్ష చేశానని, చావునోట్లో తలపెట్టి ప్రత్యేక తెలంగాణాను సాధించానని మాత్రమే చెప్పుకునే వారు. అయితే బహిరంగ సభల్లో జనాలను ఏపీకి వ్యతిరేకంగా తెలంగాణా జనాలను రెచ్చగొట్టాలంటే మాత్రం అమరులని, అంతమంది చనిపోయారని ఇంతమంది చనిపోయారని చెప్పేవారు.
కేసీయార్ చెప్పిన మాటలన్నీ ఇపుడు చరిత్రలో కలిసిపోయాయి. రెండు సార్లు ముఖ్యమంత్రిగా కేసీయార్ బాధ్యతలు తీసుకున్న అమరుల కుటుంబాలను గుర్తించిందిలేదు. కానీ ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అమరుల కుటుంబాలకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది. ఆహ్వానాలు పంపటం గొప్ప విషయమేమీకాదు. కాకపోతే వాళ్ళ త్యాగాలకు ఏదన్నా ఫలితం చూపిస్తేనే గొప్పగా ఉంటుంది. ఇక్కడ విషయం ఏమిటంటే అమరుల మృతికి చిహ్నంగా అమరజ్యోతిని ఏర్పాటు చేసినపుడు కూడా కేసీయార్ ప్రభుత్వం నుండి అందరికీ ఆహ్వానం పంపలేదు.
కేసీయార్ ప్రభుత్వంలో జరిగిందాన్ని ఇపుడు అమరుల కుటుంబాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని గుర్తించే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా మ్యానిఫెస్టోలో కూడా ప్రస్తావించింది. ఇపుడు ఎల్బీ స్టేడియంలో అమరులకుటుంబాలకు, ఉద్యమకారుల కుటుంబాలకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేసింది. అమరులకు అయినా, ఉద్యమకారుల కుటుంబాలకు వాళ్ళ ఊర్లలో తలా 250 గజాల ఇంటి స్ధలాలు ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పింది. చెప్పిన మాటను నెరవేర్చితే కాంగ్రెస్ మొదటి అడుగు బాగానే ఉందని అనుకుంటారు. లేకపోతే రివర్సు అవటం ఖాయం.