కేసీయార్ సభకు వస్తారా ?

ఇపుడీ అంశంమీదే చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాగూ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయి. మహాయితే సమావేశాలు ఓ ఐదురోజులు జరిగితే ఎక్కువ. సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్నది ముఖ్యంకాదు. జరిగే సమావేశాలకు కేసీయార్ హాజరవుతారా లేదా అన్నదే కీలకం. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పాటించాల్సిన కనీసపాటి ప్రోటోకాల్ ను కూడా పాటించలేదు. మామూలుగా ఓడిపోయిన తర్వాత రాజ్ భవన్ కు వెళ్ళి గవర్నర్ ను కలవటం ప్రోటోకాల్ మాత్రమే.

ఓడిపోయారు కాబట్టి కేసీయార్ గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను అందిచాలి. ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండమని గవర్నర్ కోరటం సంప్రదాయమే. అయితే కేసీయార్ ఇక్కడ హుందాగా నడుచుకోలేదు. గవర్నర్ ను కలవటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అందుకనే రాజీనామా లేఖను తన ఓఎస్డీకి ఇచ్చి పంపారు. ఓఎస్డీని గవర్నర్ వ్యక్తిగతంగా కలిశారా ? కలిస్తే గవర్నర్ ఏమన్నారు అన్న విషయాలు తెలీవు.

మొత్తానికి ప్రగతిభవన్ను ఖాళీచేసిన కేసీయార్ అట్నుంచి అటే ఫాం హౌస్ కు వెళ్ళిపోయారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఇచ్చిన జనాలకు కనీసం ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా చెప్పకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారన్న విషయం బాగా అర్ధమవుతోంది. పార్టీ ఓడిపోవటమే కాకుండా వ్యక్తిగతంగా తాను కామారెడ్డిలో కూడా ఓడిపోయారు. బహుశా ఈ రెండింటి వల్ల కేసీయార్ జనాలపై బాగా మండుతున్నారేమో తెలీదు. ఎన్నికల్లో గెలుపోటములు చాలా సహజమన్న విషయాన్ని కేసీయార్ వ్యక్తిగతంగా చాలా అవమానంగా తీసుకున్నట్లు అర్ధమవుతోంది.

ఇక్కడే కేసీయార్ వైఖరిని చూసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి హోదాలో అసలు అసెంబ్లీకి హాజరవుతారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీకి హాజరైతే అక్కడ రేవంత్ రెడ్డిని ఫేస్ చేయాల్సుంటుంది. వీళ్ళద్దరి మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పని అందరికీ తెలిసిందే. ఒకపుడు అసెంబ్లీలో రేవంత్ ను నోరెత్తనీయకుండా కేసీయార్ సస్పెండ్ చేయించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరిపుడు అవకాశం దొరికితే కేసీయార్ ను దెబ్బకు దెబ్బ తీయకుండా ఊరుకుంటారా ? ఆ విషయం కేసీయార్ ఊహించలేరా ? అందుకనే కేసీయార్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయమై అనుమానాలు పెరిగిపోతున్నది.