తెలగాణపై కాంగ్రెస్ ముద్ర స్పష్టంగా కనిపించింది. కేవలం అధికారంలోకి రావడమే కాదు.. ఎవరూ ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు ఒకింత ఎక్కువగానే కాంగ్రెస్ తన స్థిరత్వాన్ని నిలబెట్టుకుం ది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకొనే పరిస్థితి నుంచి తెలంగాణ అధికారాన్ని కైవసం చేసుకునే పరిస్థితి వడివడిగా అడుగులు వేసింది. మొత్తం 119 స్థానాల్లో మేజిక్ ఫిగర్ 60 దాటుకుని.. మరో 4అదనంగా తన బ్యాగ్‌లో వేసుకుంది.
మొత్తానికి సుస్థిరమైన ప్రభుత్వమే ఇప్పుడు తెలంగాణలో ఏర్పడింది. అయితే.. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. కొత్తవారిని గెలిపించుకోవడంతోపాటు.. దాదాపు 40 ఏళ్లుగా బోణీ కొట్టని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ గెలుపు గుర్రం ఎక్కడం విశేషమే అని అంటున్నారు పరిశీలకులు. 1983 నుంచి పరిశీలిస్తే.. తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పడుతూ లేస్తూ వస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయిలో స్థానాలను పార్టీ కైవసం చేసుకున్న దాఖలా లేదు.
కానీ, ఈ దఫా రేవంత్ సునామీ కావొచ్చు.. 6 గ్యారెంటీల పథకాలు కావొచ్చు.. సమష్టి కృషి కావొచ్చు.. పేరు ఏదైనా.. పార్టీకి మేలు జరిగిందనే అంటున్నారు. గతంలో గెలవని నియోజకవర్గాల్లోనూ పార్టీ విజయం దక్కించుకోవడం గమనార్హం.
1983లో 43 సీట్లకే పరిమితమైన పార్టీ.. 1985 ఎన్నికల్లో మరింత దారుణంగా 14 స్థానాలే దక్కించుకుంది. ఇక, 1989 నాటికి పుంజుకుని 57 స్థానాల్లో విజయం దక్కించుకుంది. ఇక, తర్వాత జరిగిన 1994 ఎన్నికల్లో 10 స్థానాలకు కుదించుకుంది. ఇక, 1999 ఎన్నికల్లో 43, 2004లో 54, 2009లో 50 స్థానాలు దక్కించుకుంది. ఇక, తెలంగాణ ఆవిర్భవించిన 2014లోనూ కేవలం 21 స్థానాలకే పరిమితమైంది.
గత 2018లో జరిగిన ఎన్నికల్లో 19 స్థానాలే దక్కించుకుంది. కానీ, ఇప్పుడు ఈ రికార్డులను చెరిపేసి సరికొత్త దిశగా .. అడుగులు వేసి.. ఏకంగా 64 స్థానాల్ల విజయం దక్కించుకోవడం గమనార్హం. వీటిలో మునుపెన్నడూ గెలవని నియోజకవర్గాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.