అల్లర్లతో అట్టుడికిపోతున్న చోటుకు వెళ్లనున్న ట్రంప్

అమెరికాలోని నల్లజాతీయుల మీద ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల నల్లజాతీయుడు జేకబ్ బ్లేక్ పైన పోలీసులు తుపాకీతో కాల్పులు జరపటం.. దీనికి సంబంధించి వీడియో ఒకటి వైరల్ గా మారింది. చేతిలో కత్తి లాంటి ఆయుధం ఉందన్న పేరుతో.. చుట్టూ మూగిన పోలీసులు ఆ వ్యక్తిపై కాల్పులు జరపటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జేకబ్ ప్రాణాపాయస్థితిలోనే ఉన్నాడు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలువురు నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇక.. ఈ ఘటనకుకారణమైన కేనోషా పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇక్కడి వారు రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వుతూ.. కనిపించిన వాహనాలకు నిప్పు పెడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగిస్తున్నారు.

దీంతో.. కేనోషా పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. పోలీసుల చర్యను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న జో బైడెన్ ఈ అంశం మీద స్పందించారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. దీంతో.. అధ్యక్షుడు ట్రంప్ పై ఒత్తిడి పెరిగిపోయింది. ఆయన హయాంలో నల్లజాతీయుల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయన్న ప్రచారం సాగుతోంది.

ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ.. ఇలాంటి వాటిని వెంటనే ప్యాచప్ చేయాలన్న ఆలోచనలో ఉన్న ట్రంప్.. తీవ్ర ఉద్రిక్తలున్న కేనోషా పట్టణాన్ని తాను పర్యటించనున్నట్లుగా ట్రంప్ చెబుతున్నారు. అల్లర్లతో అట్టుడుగుతున్న ప్రాంతాన్ని చూసేందుకు ట్రంప్ చూపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తే.. ఎన్నికలు ఎంతటి ప్రభావాన్ని చూపిస్తున్నాయన్న ఇట్టే అర్థం కాక మానదు.