తెలంగాణ రిజ‌ల్ట్‌.. చంద్ర‌బాబు అభిమానుల ముఖ చిత్ర‌మేంటో!

తెలంగాణ ప్ర‌జాతీర్పు.. కాంగ్రెస్ వైపే మొగ్గు చూపింది. ఇదిలావుంటే.. టీడీపీ అభిమానులు, ముఖ్యంగా చంద్ర‌బాబు అభిమానుల తీరు ఎలా ఉంది? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉన్న విష‌యం తెలిసిందే.

బ‌హిరంగంగా ఏ పార్టీకీ మద్ద‌తు కూడా ప్ర‌క‌టించ‌లేదు. అయితే.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మాత్రం కాంగ్రెస్‌కు టీడీపీ అనుకూల భావ‌న వైర‌ల్ అయింది. పైగా.. రేవంత్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న‌ప్ప‌టికీ.. ఆ పార్టీని న‌డిపించిన‌ప్ప‌టికీ.. ఆయ‌న డీఎన్ ఏ మాత్రం టీడీపీదే కావ‌డంతో చంద్ర‌బాబు అభిమానులు.. రేవంత్‌ను ఆద‌రిస్తార‌నే చ‌ర్చ ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగింది. ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకోవ‌డం చూస్తే.. ఇది నిజ‌మేన‌ని అనిపిస్తోంది.

నిజామాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, హైద‌రాబాద్, వ‌రంగ‌ల్‌ వంటి జిల్లాల్లో టీడీపీ శ్రేణులు ఎక్కువ‌గా ఉన్నా యి. పైగా చంద్ర‌బాబు అభిమానులు కూడా ఉన్నారు. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ పుంజుకోవ‌డం.. బ‌ల‌మైన స్థానాల‌ను ద‌క్కించుకునే విధంగా దూసుకుపోతుండ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు ఇక్క‌డ ప్ర‌త్య‌క్షంగా పోటీ చేయ‌క‌పోయినా.. ప‌రోక్షంగా ఆయ‌న ప్ర‌భావం చూపిస్తార‌నే వాద‌న కాంగ్రెస్‌కు బాగానే క‌లిసి వ‌చ్చింది.

ఎన్నిక‌ల‌కు ముందు.. చంద్ర‌బాబు అరెస్టుపై హైద‌రాబాద్ , వ‌రంగ‌ల్ వంటి జిల్లాల్లో ఉద్యోగులు ఆందోళ‌న కు దిగారు. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. అధికార పార్టీ వీరిపై పోలీసుల‌ను ప్ర‌యో గించిన విష‌యం తెలిసిందే. దీంతో అప్ప‌టి వ‌ర‌కు సానుకూల ధోర‌ణి ఉన్న బీఆర్ ఎస్‌కు ఆ వోటు ద‌క్క‌కుండా పోయింద‌నే వాద‌న ఉంది. ఇక‌, ప్ర‌స్తుత ట్రెండ్ చూస్తే.. చంద్ర‌బాబు అభిమానులు ఆనందంలో ఉన్నార‌నే చెప్పాలి.