తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలు గెలుచుకొని 5 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. దాదాపు 65 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. హ్యాట్రిక్ విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనుకున్న సీఎం కేసీఆర్ ఆశలు అడియాశలుగానే మిగిలాయి. బీఆర్ఎస్ 31 స్థానాలలో విజయం సాధించి 8 స్థానాలలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు.
గవర్నర్ తమిళిసైని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు కేసీఆర్. మరికొద్ది సేపట్లో ప్రగతి భవన్ నుంచి బయలుదేరి రాజ్ భవన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను కొనసాగమని గవర్నర్ తమిళిసై అడిగే అవకాశముంది. అయితే, అందుకు కేసీఆర్ అంగీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
రేపు గవర్నర్ ను కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలిసే అవకాశముంది. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గవర్నర్ కు వారు సమర్పించనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా బలం తమకుందని గవర్నర్ కు వారు తెలపనున్నారు. మరోవైపు, ఈ రోజు రాత్రి గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులతో కర్ణాటక డిప్యూటీ సీఎం శివ కుమార్ భేటీ కాబోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates