వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పొత్తు విషయంలో జనసేన నాయకులు చాలా మంది విభేదిస్తున్నారు. ఎంతో మంది పార్టీ కోసం పనిచేశారని.. ఎంతో ఖర్చు కూడా చేశారని.. పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని తపించామని.. ఇప్పుడు కాదని పొత్తు పెట్టుకుని.. సీఎం సీటును వదులుకుంటారా? అనేదివారి భావన. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన ఉమ్మడి సమన్వయ సమావేశాలు దాదాపు విఫలమయ్యాయి.
ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా జనసేన నాయకులతో పవన్ భేటీ అవుతున్నారు. బుజ్జగింపు రాజకీయాలకు తెరదీశారు. తాను ఏ పరిస్థితిలో పొత్తులకు వెళ్లిందీ వారికి చెబుతున్నారు. అదేసమయంలో పదవులపై తనకు ఆశలు లేవని కూడా వారికి వెల్లడించారు. మీరు కూడా పదవులు ఆశించొద్దని చెప్పారు. తాజాగా.. మరోసారి టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందీ… ఆయన వివరించారు.
రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టాను. తాను పార్టీని నడుపలేనని చాలామంది అన్నారని పవన్ చెప్పారు. అయినా.. పార్టీని నడిపిస్తూనే ఉన్నానని.. ఎంతో కష్టపడుతున్నానని చెప్పారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకోలేదని పవన్ చెప్పుకొచ్చారు. ఒకవేళ అలా తీసుకుని ఉంటే.. పార్టీ మరింత బలంగా ఉండేదని చెప్పారు.
అదే కనుక జరిగి ఉంటే(ఇతర పార్టీల నుంచి జనసేనలోకి ఆకర్ష్ మంత్రం పఠించి.. చేరికలను ప్రోత్సహించి ఉంటే) 2024 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి ఉండేవారమని జనసేన నాయకులకు నచ్చజెప్పారు. కానీ ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకోలేదని తెల్చిచెప్పారు. అందుకే.. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్నామని.. దీనిని నాయకులు సహృదయంతో అర్ధం చేసుకుని పార్టీకి సహకరించాలని పవన్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో రెండు ఎన్నికలు గెలిచిన బీఆర్ఎస్ మూడో ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయిందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అధికారం చూడని వారికి అధికారం ఇవ్వడమే నిజమైన సాధికారత అని తెలిపారు. తాను ఒంటరి తనాన్ని అనుభవించానని అవమానాలు కూడా పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జనసేన కుటుంబం తనకు అండగా ఉందని వెల్లడించారు.