తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన ఖాయమని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చాటుతున్నాయి. గత 2018 కంటే కూడా.. ఇప్పుడు మరింత ఎక్కువ మంది ప్రజలను కలిశామని.. తమ సర్వేలపై అనుమానం అవసరం లేదని కూడా.. సర్వే సంస్థలు చెబుతుండడం గమనార్హం. ఇక, తమకు అనుకూలంగా వచ్చిన సర్వేలపై కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేయడం.. ఇదేసమయంలో తమకు వ్యతిరేకంగా ఉన్న సర్వేలపై బీఆర్ ఎస్ పెదవి విరచడం కనిపించిందే.
ఇదిలావుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేయడం ఖాయమని తేలిపోయిన తర్వాత.. పార్టీలో పదవుల వేట ప్రారంభమైంది. గడిచిన పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ.. ఒక్క పనిని కూడా చేయించుకోలేక పోయి న నాయకులు.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే వార్తలతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇదేసమయంలో మరికొందరు ఎట్టి పరిస్థితిలోనూ పదవిని పొందాలనే కాంక్షతో ప్రయత్నాలు చేస్తున్నా రు. సీఎం రేసు నుంచి మంత్రి వర్గం వరకు చాలా మంది నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి.
ఈ కోవలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు… జానారెడ్డి(ఈయన పోటీ చేయలేదు. కానీ, మండలికి పంపించి.. తనను మంత్రిని చేయాలనే డిమాండ్‌ను రెడీ చేసుకున్నారు), షబ్బీర్ అలీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఈయన సతీమణి పద్మావతి(ఈమె కూడా.. మంత్రి వర్గ రేసులో ఉన్నారు), మహమ్మద్ అజారుద్దీన్, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పీజేఆర్ కుమార్తె విజయ, కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. ఇలా అనేక మంది నాయకులు రెడీగా ఉన్నారు.
వీరికి తోడు పోటీకి దూరంగా ఉన్న వారు.. అధిష్టానంతో చేరువ ఉన్నవారు కూడా.. మరో మార్గంలో పదవు లు దక్కించుకునేందుకు సిద్ధపడుతున్నారు. పదేళ్లపాటు పార్టీ ని బలోపేతం చేసేందుకు చమటోడ్చాం.. ఇప్పుడు పదవులు ఆశిస్తే.. తప్పేంటి? అని వారు ప్రశ్నిస్తుండడం గమనార్హం. వీరివాదనలోనూ వాస్తవం ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇంత మందికి పదవులు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అనేది కీలక ప్రశ్న. చూడాలి.. మరి ఎంత మందికి లక్కు చిక్కుతుందో.