తెలంగాణ అసెంబ్లీ ఎన్నిల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించడం తమకు చిటికెలో పని అని.. అత్యంత సులువు అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. కేసీఆర్‌ను ఓడించేందుకు.. బీఆర్‌ఎస్‌ను గద్దె దించేందుకు కంకణం కట్టుకున్న నేపథ్యంలో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని షర్మిల చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు.
“కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఓడించడం.. అత్యంత సులభం. కానీ, మేం త్యాగం చేశాం. బీఆర్ ఎస్‌ను, కేసీఆర్‌ను గద్దె దించేందుకు.. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో వైఎస్ బిడ్డగా నేను పోటీ నుంచి తప్పుకొన్నా. ఈ సందర్భంగా కేసీఆర్‌కు గిఫ్ట్ ఇస్తున్నా. బైబై కేసీఆర్” అంటూ.. షర్మిల వ్యాఖ్యానించారు. ఈ సమయంలో బైబై కేసీఆర్ అని రాసి ఉన్న సూట్ కేసును ఆమె మీడియాకు ప్రదర్శించారు.
అయితే.. షర్మిల చేసిన వ్యాఖ్యలపై రాజకీయ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆడలేనమ్మ.. మద్దెల ఓడు అన్నట్టుగా ఉందని అంటున్నారు. ఇక, కాంగ్రెస్ మద్దతు కోరిందా? లేక.. మీరే ఎదురెళ్లి కాంగ్రెస్‌ను కౌగిలించుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ మద్దతు కోరి ఉంటే.. ఆ పార్టీ నాయకులు ఎవరూ కూడా షర్మిల తమకు మద్దతు ప్రకటించిందని చెప్పే ప్రయత్నం చేయలేదు కదా! అని వ్యాఖ్యా నిస్తున్నారు.
కేవలం అభ్యర్థులు లేకపోవడం.. నియోజకవర్గాల్లో కార్యకర్తల బలం కూడా లేకపోవడంతోనే పోటీ నుంచి తప్పుకొన్నారన్న వ్యాఖ్యలపై షర్మిల స్పందించాలని పలువురు కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నా రు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనాయకులు కూడా.. షర్మిలను ఎక్కడా పట్టించుకోలేదు. డీకే శివకుమార్ వంటి నాయకులు తెలంగాణలో చక్రం తిప్పినా.. వారు కూడా షర్మిల ఊసు ఎత్తకపోవడం గమనార్హం.